Share News

ఉన్నత విద్యకు ఉరి!

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:02 AM

ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవలేని విద్యార్థులకు ప్రభుత్వ యూనివర్సిటీలు, యూనివర్సిటీ కాలేజీలే పెద్దదిక్కులా ఉంటాయి.

ఉన్నత విద్యకు ఉరి!

ఒకే పోస్టుకు రెండుసార్లు నోటిఫికేషన్లు, జీవోలివ్వడం.. తర్వాత పోస్టుల భర్తీని మర్చిపోవడమనే విధానం జగన్‌ ప్రభుత్వానికి అలవాటుగా మారింది!. 2021 జూన్‌ 14... ఆ రోజున జగన్‌ ప్రభుత్వం ఏకైకంగా ఒకే ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. 10,143 పోస్టులతో విడుదల చేసిన ఆ జాబ్‌ క్యాలెండర్‌లో 2వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. 2023 అక్టోబరు 11.. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ జీవోలు జారీచేసింది. అనంతరం వర్సిటీలు అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీచేశాయి. ఇందులో 2వేలు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 1280 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. అదేంటి 2021 జాబ్‌ క్యాలెండర్‌లోనే భర్తీచేసిన పోస్టులకు 2023లో మళ్లీ నోటిఫికేషన్లు ఎలా ఇచ్చారనే సందేహం కలుగుతోందా? జగన్‌ ప్రభుత్వంలో అంతే!! ఆ తర్వాత జాబ్‌ క్యాలెండర్‌లోని పోస్టులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మళ్లీ కొన్నాళ్లకు అవే పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. చివరికి అవీ భర్తీ కావు. ఇదీ జగన్‌ ప్రభుత్వంలో పోస్టుల భర్తీ విధానం!!

పోస్టుల భర్తీపై మాట తప్పిన జగన్‌

నాలుగేళ్లు చోద్యం చూసి చివర్లో నోటిఫికేషన్లు

ఆగిపోయిన మొత్తం భర్తీ ప్రక్రియ

వర్సిటీల్లో ఉన్న బోధనా సిబ్బంది 20శాతమే

2021 జాబ్‌ క్యాలెండర్‌లో పెట్టినా భర్తీ చేయలేదు

ఆచార్యుల్లేకుండానే సా.. గుతున్న బోధన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవలేని విద్యార్థులకు ప్రభుత్వ యూనివర్సిటీలు, యూనివర్సిటీ కాలేజీలే పెద్దదిక్కులా ఉంటాయి. అందులోనూ యూనివర్సిటీ కాలేజీలంటే నిపుణులైన బోధనా సిబ్బంది ఉంటారని, మెరుగైన సౌకర్యాలుంటాయని ఒక అంచనా ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలను బోధనా సిబ్బంది లేకుండా జగన్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. 4,230 బోధనా సిబ్బంది పోస్టుల్లో 3,300 పోస్టులు ఖాళీగా ఉంచి ఉన్నత విద్యా కోర్సుల బోధన చేయిస్తోంది. ఆర్జీయూకేటీలతో సహా మొత్తం రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటీల్లో 4230 పోస్టులున్నాయి. అందులో ప్రొఫెసర్‌ 598, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 1080, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 2224 పోస్టులున్నాయి. అందులో పనిచేస్తున్నవారి వివరాలు చూస్తే ప్రొఫెసర్‌ 316, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 199, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 533 మంది మాత్రమే. 3వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సుమారు 80శాతం పోస్టులు ఖాళీగా ఉంటే, 20శాతం పోస్టుల్లేనే బోధనా సిబ్బంది పనిచేస్తున్నారు.

న్యాయ వివాదాలు పరిష్కారమైనా..

యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి గతంలో న్యాయ వివాదాలుండేవి. ఆ వివాదాలు ఈ ప్రభుత్వంలో పరిష్కారమయ్యాయి. వెంటనే ఆ పోస్టులు మొత్తం భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హడావుడిగా 2021లో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో 2వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను చూపించింది. ఆ తర్వాత ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. చివరికి రేషనలైజేషన్‌ పూర్తిచేసి 2023 చివర్లో నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే అప్పటివరకూ ఉన్న న్యాయ వివాదాలను ఉన్నత విద్యామండలి తిరిగి తెచ్చిపెట్టింది. మొత్తం నిబంధనలను తుంగలో తొక్కి సొంత రోస్టర్‌ విధానాన్ని అమలుచేసి, మళ్లీ న్యాయ వివాదాలతో ప్రక్రియ ఆగిపోయేలా చేసింది. ఒకే వర్సిటీలో రెండు రకాల రిజర్వేషన్‌ విధానం ప్రవేశపెట్టడంపై అధ్యాపకులు కోర్టును ఆశ్రయించడంతో భర్తీ ఆదిలోనే ఆగిపోయింది.

ఇష్టంలేకే వివాదాలు

అయితే ప్రభుత్వ ఆదేశాలతోనే రోస్టర్‌ను ఉన్నత విద్యామండలి గందరగోళం చేసిందనే అనుమానాలు, విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చిన జగన్‌ ప్రభుత్వానికి తొలినుంచీ పోస్టుల భర్తీపై ఆసక్తి లేదు. అందుకే ఒకే పోస్టుకు మళ్లీ మళ్లీ నోటిఫికేషన్లు జారీచేయించినా ప్రక్రియ మాత్రం చేపట్టలేదు. అందులోనూ ఉన్నత విద్యామండలిలో కీలక స్థానాల్లో ఉన్న వారితోనే రేషనలైజేషన్‌ కమిటీలు వేసినా రోస్టర్‌ను ఇష్టమొచ్చినట్లు మార్చడంతో ప్రభుత్వ డైరెక్షన్‌తోనే ఇలా నిబంధనలకు విరుద్ధంగా చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. యూనివర్సిటీల్లో సీట్లు ఖాళీ

యూనివర్సిటీల కాలేజీల్లో ఒకప్పుడు సీట్లు హాట్‌ కేకుల్లా భర్తీ అయ్యేవి. కానీ బోధనా సిబ్బంది కొరతతో కొన్నేళ్లుగా వర్సిటీల కాలేజీల్లోనూ సీట్లు మొత్తం భర్తీకావడంలేదు.. 2023-24 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీల కాలేజీల్లో 7455 ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే 5813 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అదే రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద 4103 ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే, 3811 సీట్లు తొలి విడతలోనే నిండాయి. ఇక మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లయితే ఒక్కటి కూడా మిగలడం లేదు. ఇలా ప్రైవేటు యూనివర్సిటీల్లో సీట్లు మొత్తం భర్తీ అయిపోతుంటే, ప్రభుత్వ యూనివర్సిటీల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి.

పీజీ కోర్సులదీ అదే దారి!

యూనివర్సిటీల్లో పీజీ కోర్సులు కూడా దారుణంగా పడిపోయాయి. గత ప్రభుత్వంలో ఇతరత్రా కోర్సులతో పాటు పీజీ కోర్సులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తించింది. జగన్‌ ప్రభుత్వంలో అక్రమాలంటూ పీజీ కోర్సులకు రీయింబర్స్‌మెంట్‌ ఆపేశారు. కేవలం ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీలకే రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నారు. ప్రైవేటుకు రీయింబర్స్‌మెంట్‌ రద్దుచేసినా విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అంటే బోధనా సిబ్బంది సరిపడిన స్థాయిలో లేకపోవడమే అని అర్థమవుతోంది.

Updated Date - Apr 08 , 2024 | 04:02 AM