Share News

టీడీపీలోకి గుమ్మనూరు

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:22 AM

మాజీ మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీలోకి గుమ్మనూరు

‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు సమక్షంలో చేరిక

అంతకుముందే మంత్రి పదవికి, వైసీపీకీ రాజీనామా

ఆమోదించకుండా బర్తరఫ్‌ వేటు వేసిన జగన్‌

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం ‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా సీఎం జగన్‌ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తితో ఉన్న జయరాంకు ఆలూరు వైసీపీ టికెట్‌ మళ్లీ ఇవ్వలేదు. కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని జగన్‌ సూచించారు. అసెంబ్లీకే పోటీచేస్తానని పట్టుబట్టినా పట్టించుకోలేదు. దీంతో జయరాం టీడీపీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రికి లేఖను మీడియా ప్రతినిధుల ముందే పంపారు. తనకు కర్నూలు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని, గుంతకల్లు నుంచి టీడీపీ తరఫున పోటీచేస్తానని వెల్లడించారు. ఆయన రాజీనామాను జగన్‌ ఆమోదించకుండా ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సిఫారసు చేశారు. దీంతో గవర్నర్‌ ఆయన్ను కేబినెట్‌ నుంచి తొలగించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ గెజిట్‌ విడుదల చేసింది.

Updated Date - Mar 06 , 2024 | 04:41 AM