Share News

ఉద్యోగానికి గుల్జార్‌ అన్‌ఫిట్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:59 AM

ఐఏఎస్‌ అధికారి ఎన్‌ గుల్జార్‌పై ఏపీ హైకోర్టు మండిపడింది.

ఉద్యోగానికి గుల్జార్‌ అన్‌ఫిట్‌

అధికార విభజనను అపహాస్యం చేశారు

కారుణ్య నియామకంలో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు

ఉద్యోగం నుంచి తొలగించాలని ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలి

ఐఏఎస్‌ గుల్జార్‌పై హైకోర్టు మండిపాటు.. విచారణ 1కి వాయిదా

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్‌ అధికారి ఎన్‌ గుల్జార్‌పై ఏపీ హైకోర్టు మండిపడింది. హైకోర్టు తీర్పునకు భిన్నంగా కారుణ్య నియామకం విషయంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (కమర్షియల్‌ ట్యాక్స్‌) హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. రాజ్యంగ బద్ధమైన పాలన పట్ల గౌరవంలేని గుల్జార్‌ ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగేందుకు అసమర్థుడని (అన్‌ఫిట్‌) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చి ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని నిర్ధారించింది. న్యాయపాలన, అధికార విభజనను ఉన్నతాధికారి అపహాస్యం చేశారని, కార్యనిర్వహణ వ్యవస్థకున్న లక్ష్మణరేఖను గుల్జార్‌ దాటారని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా కోర్టుధిక్కరణ బాధ్యులవుతారని తెలిపింది. కోర్టు ముందు ఉన్న ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే, ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగేందుకు గుల్జార్‌ అసమర్థుడని తేల్చింది. ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదో, అలాగే కోర్టుధిక్కరణ కింద ఎందుకు ప్రాసిక్యూట్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలని గుల్జార్‌ను ఆదేశిస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలంది. గుల్జార్‌పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది.


పిటిషనర్‌ బసవ శ్రీనివా్‌సకు కారుణ్య నియామకం కింది ఉద్యోగమిచ్చేందుకు నిరాకరిస్తూ గుల్జార్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఉద్యోగం కోసం 2022లో పిటిషనర్‌ పెట్టుకున్న దరఖాస్తును తిరిగి పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. బి.సరస్వతిదేవి అనే ఉద్యోగిని వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్‌ కమిర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ మరణించారు. ఆమె చిన్నకుమారుడు బసవ శ్రీనివాస్‌ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన తండ్రి అప్పటికే సర్వీస్‌ పెన్షన్‌ పొందుతున్నారని, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందేందుకు శ్రీనివాస్‌ వయస్సు దాటి పోయారనే కారణాలతో దరఖాస్తును తిరస్కరిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ బసవ శ్రీనివాస్‌ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి అధికారులు జారీచేసిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ కారుణ్య నియామకం కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌ను ఆదేశించారు.


ఆ దరఖాస్తుపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు అమలు కాకపోవడంతో పిటిషనర్‌ కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది విచారణలో ఉండగానే శ్రీనివాస్‌ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ ఆర్థిక శాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి (కమర్షియల్‌ ట్యాక్స్‌) గుల్జార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు ఆదేశాలు అమలుచేయడంతో న్యాయస్థానం కోర్టుధిక్కరణ పిటిషన్‌పై విచారణను మూసివేసింది. దీంతో గుల్జార్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి కారుణ్య నియామక దరఖాస్తును తిరస్కరిస్తూ గుల్జార్‌ ఇచ్చిన ఉత్తర్వులను తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో ఏ అంశాలను అయితే హైకోర్టు తప్పుపట్టిందో ఆ కారణాలతో పిటిషనర్‌ దరఖాస్తును గుల్జార్‌ మరోసారి తిరస్కరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చి గుల్జార్‌ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని నిర్ధారించారు. రాజ్యంగబద్ధమైన పాలన పట్ల గౌరవంలేని గుల్జార్‌ ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగేందుకు అసమర్థుడని పేర్కొన్నారు. ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వానికి ఎందుకు ఆదేశాలివ్వకూడదో, అలాగే కోర్టు ధిక్కరణ కింద ఎందుకు ప్రాసిక్యూట్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 07:43 AM