Share News

గ్రీన్‌కో డైరెక్టర్‌ మచిలీపట్నం రేసులో..

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:34 AM

మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో జనసేన అభ్యర్థిత్వం ఆసక్తికరంగా మారింది.

గ్రీన్‌కో డైరెక్టర్‌ మచిలీపట్నం రేసులో..

జనసేన పరిశీలనలో బండారు నరసింహారావు!

ప్రస్తుత ఎంపీ బాలశౌరి కూడా..

అవనిగడ్డ, పాలకొండ టికెట్ల కోసం ముగ్గురేసి నేతల పోటీ

ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేపట్టిన నాయకత్వం

రెండ్రోజుల్లో పవన్‌ తుది నిర్ణయం

30 నుంచి జనసేనాని ఎన్నికల శంఖారావం

3 విడతల్లో ప్రచారం.. పిఠాపురం నుంచే ఆరంభం

అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో జనసేన అభ్యర్థిత్వం ఆసక్తికరంగా మారింది. వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన ఎంపీ వల్లభనేని బాలశౌరికే ఈ టికెట్‌ ఇస్తారని ఇప్పటిదాకా ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా వేరే పేరు తెరపైకి వచ్చింది. గ్రీన్‌కో కంపెనీ డైరెక్టర్‌ బండారు నరసింహారావు పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరు పోటీ చేస్తారో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రెండ్రోజుల్లో ఖరారు చేస్తారని అంటున్నారు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ, శ్రీకాకుళం జిల్లా పాలకొండ అసెంబ్లీ స్థానా ల అభ్యర్థులపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ రెండు స్థానాల్లో పార్టీ తరఫున ముగ్గురేసి నేతలు పోటీపడుతున్నారు. అవనిగడ్డలో విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో విక్కుర్తి వైపు నాయకత్వం దాదాపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఈ ముగ్గురి పేర్లపై సర్వే చేపట్టింది. పాలకొండలో కూడా సర్వే చేపట్టింది. ఆయా అభ్యర్థులను మంగళగిరికి పిలిచి మాట్లాడుతున్నారు.

30 నుంచి 3 రోజులు పిఠాపురంలోనే..

జనసేనాని 30వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పిఠాపురంలోనే ఎన్నికల శంఖం పూరిస్తారు. తొలిరోజు శక్తిపీఠమైన పురూహూతిక అమ్మవారి దర్శనం చేసుకుని వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. నియోజకవర్గంలో మూడ్రోజులు పర్యటిస్తారు. బంగారుపాప దర్గాకు వెళ్తారు. క్రైస్తవ పెద్దలతో భేటీ అవుతారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. పవన్‌ సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పిఠాపురం నుంచే నియోజకవర్గాలకు తరలివెళ్లాలని.. మూడు విడతలుగా ప్రచారం సాగించాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీచేసే నియోజకవర్గాల గుండా యాత్ర సాగేలా షెడ్యూల్‌ ఖరారు చేయాలని నేతలను పవన్‌ ఆదేశించారు. ఉగాది వేడుకలను పిఠాపురంలోనే జరుపుకోవాలని కూడా నిశ్చయించారు.

పవన్‌ హోలీ శుభాకాంక్షలు..

వసంత రుతువు అడుగిడే తరుణంలో భారతీయులందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకొనే వేడుక హోలీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశ ప్రజలందరికి హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితం వర్ణమయం కావాలని, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో సహజసిద్ధమైన రంగులనే వినియోగించడం శ్రేయస్కరమని.. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని పేర్కొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 08:58 AM