Share News

పాడేరు మెడికల్‌ కాలేజీ అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:30 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని మెడికల్‌ కళాశాలలో ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

పాడేరు మెడికల్‌ కాలేజీ అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్‌

50 సీట్లతో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు

సీఎం చంద్రబాబు చొరవతో ఎన్‌ఎంసీ అనుమతి

పాడేరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని మెడికల్‌ కళాశాలలో ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వాస్తవానికి రాష్ట్రంలో పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలోని మెడికల్‌ కళాశాలలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో.. ఈ ఏడాది (2024-25) తరగతుల నిర్వహణకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో పాడేరు మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్‌ ద్వారా (ఎల్‌ఓపీ) అనుమతి లేఖను పంపింది.

గిరిజన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధతో..

గిరిజన ప్రాంతమైన పాడేరులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా స్థానిక మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.హేమలత ఈ ప్రాంతంలో వైద్యపరంగా గిరిజనుల అవసరాలు, సమస్యలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. దీన్ని సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఎన్‌ఎంసీకి సమర్పించారు. తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పాడేరు మెడికల్‌ కాలేజీలో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో ఈ ఏడాదే తరగతులను ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ అనుమతి ఇచ్చింది.

Updated Date - Sep 04 , 2024 | 06:49 AM