Share News

ఆ కేసుల్లోనూ ముందస్తు బెయిలివ్వండి

ABN , Publish Date - May 27 , 2024 | 04:19 AM

పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ ధ్వంసం వ్యవహారంలో మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..

ఆ కేసుల్లోనూ ముందస్తు బెయిలివ్వండి

హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి

ఆయన కోర్టు షరతులను ఉల్లంఘించారు

అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచన

కోర్టుకు నివేదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఎలాగైనా అరెస్టు చేయాలనే పిన్నెల్లిపై వరుస ఎఫ్‌ఐఆర్‌లు కడుతున్నారు

ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది వెల్లడి

విచారణ నేటికి వాయిదా

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ ధ్వంసం వ్యవహారంలో మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తనపై నమోదైన మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆదివారం అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లను కోర్టు హౌస్‌ మోషన్లుగా విచారణకు స్వీకరించింది. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ను ఏవిధంగానైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో వరుస ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని.. ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వుల ఉద్దేశం నెరవేరకుండా చేసేందుకు పోలీసులు వరుస ఎఫ్‌ఆర్‌ఐలు నమోదు చేస్తున్నారని తెలిపారు.

పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈవీఎం ధ్వంసంలో మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు విధించిన షరతులను పిటిషనర్‌ ఉల్లంఘించారని.. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోతున్నారని.. ఈ నేపఽథ్యంలోనే అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తనకు సూచించారని వెల్లడించారు. దాడిలో గాయపడిన సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. 2019 ఎన్నికల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇదే తరహా దాడులకు పాల్పడ్డారని.. ఆయన ముందస్తు బెయిల్‌ పొందేందుకు అర్హుడు కాదన్నారు. బెయిల్‌ మంజూరు విషయంలో నిర్ణయానికి వచ్చే ముందు ఆయన పూర్వ నేరచరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. హత్యాయత్నం వంటి తీవ్ర నేరాల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఆదివారం ఆదేశాలిచ్చారు.

ఇవీ కేసులు..

ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి రెంటచింతల పోలీసులు పిన్నెల్లి, ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నం(ఐపీసీ 307), మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వస్తున్న పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీసింది. దీంతో ఆయన ఆమెను బూతులు తిట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలింగ్‌ అనంతరం ఈ నెల 14న పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, వారి అనుచరులు కారంపూడిలో దాడులకు పాల్పడుతుండగా అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదుతో వారిపై హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మూడు ఘటనలకు సంబంధించి పోలీసులు తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - May 27 , 2024 | 04:19 AM