Share News

Jagan Govt : గల్లా పెట్టెలు ఖాళీ

ABN , Publish Date - May 27 , 2024 | 04:40 AM

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయిస్తుంది. అయితే జగన్‌ సర్కారు ‘రివర్స్‌’ అన్నమాట. ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచే నిధులు లాక్కొని వాటిని అడుక్కునే స్థాయికి దిగజార్చింది.

Jagan Govt : గల్లా పెట్టెలు ఖాళీ

జగన్‌ సర్కారు ‘డిపాజిట్ల’ గోల్‌మాల్‌లో ప్రభుత్వ శాఖలు విలవిల

మన దేశంలో ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్‌ చేయించుకుని మోసం చేసిన సంస్థలను చూస్తున్నాం! కానీ డిపాజిట్లు తిరిగి చెల్లించని ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేవు. అయితే జగన్‌ సర్కారు మాత్రమే ఇందుకు మినహాయింపు. డిపాజిటర్ల (ప్రభుత్వ సంస్థలు)కు సకాలంలో డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే.

డ్వాక్రా మహిళలు, భవన నిర్మాణ కార్మికుల నిధులు మళ్లింపు

గుంటూరులో ఆఫీసులు ‘ఖాళీ’

బీసీ ఫెడరేషన్ల సొమ్మూ ఊడ్చేశారు

మారిటైమ్‌ బోర్డుకు చుక్కలు

11% వడ్డీకి అప్పు తెచ్చి ఎస్‌ఎ్‌ఫసీలో 5శాతానికి డిపాజిట్‌

అసలు, వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో

భారీగా నష్టపోయిన ప్రభుత్వ శాఖలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయిస్తుంది. అయితే జగన్‌ సర్కారు ‘రివర్స్‌’ అన్నమాట. ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచే నిధులు లాక్కొని వాటిని అడుక్కునే స్థాయికి దిగజార్చింది. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫసీ) పేరిట సాగించిన ఈ దోపిడీ తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు డిపాజిట్‌ చేయించుకుని తిరిగి చెల్లించకుండా జగన్‌ సర్కారు మోసం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి బలవంతంగా డబ్బులు డిపాజిట్‌ చేయించుకోవడమే గాక మెచ్యూర్‌ అయి ఏళ్లు గడుస్తున్నా వెనక్కి ఇవ్వడం లేదు. సీఎం జగన్‌ నిత్యం ‘నా అక్కచెల్లెమ్మలంటూ’ జపం చేసే డ్వాక్రా మహిళల నిధులు మొదలుకొని భవన నిర్మాణ రంగ కార్మికులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, బడుగు, బలహీన వర్గాల ఫెడరేషన్ల వరకు నిధులను ఖాళీ చేసేశారు. 33 ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏపీఎ్‌సఎ్‌ఫసీలో మొత్తం రూ.4,736 కోట్లు డిపాజిట్‌ చేయించారు. ఇందులో నుంచి చట్ట విరుద్ధంగా రూ.3,670 కోట్లను రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ)కు లోను రూపంలో ఇచ్చారు. రెండున్నరేళ్ల క్రితమే డిపాజిట్లు మెచ్యూర్‌ అయినా చాలా సంస్థలకు తిరిగి చెల్లించడం లేదు. ‘ఆర్థిక శాఖ మాటలు విని, సీఎంవో అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేశాం. ఇప్పుడు వడ్డీ లేక, అసలు రాక నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వ కూడా లేక ఆర్థిక శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు’ అని ఆయా సంస్థల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తక్కువ వడ్డీకే ఇచ్చేశారు...

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే దాదాపు 8 శాతం వడ్డీ వస్తుంది. డిపాజిట్లు మెచ్యూర్‌ అవ్వగానే తిరిగి ఇచ్చేస్తారు. అదే ఏపీఎ్‌సఎ్‌ఫసీలో ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ కేవలం 4 నుంచి 5 శాతం లోపే. మెచ్యూర్‌ అయినా తిరిగి ఇవ్వడం లేదు. పైగా ఎప్పటికప్పుడు మెచ్యూరిటీ కాలపరిమితి పెంచుకుంటూ పోతున్నారు. దీని వల్ల ప్రభుత్వ శాఖలకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా కార్పొరేషన్‌/ప్రభుత్వ రంగ సంస్థ తమ వద్ద ఉన్న డబ్బు డిపాజిట్‌ చేయాలనుకుంటే అగ్రస్థానంలో ఉన్న నాలుగైదు బ్యాంకులకు ఆఫర్‌ చేస్తాయి. ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ రేటు ఇస్తే అందులో డిపాజిట్‌ చేస్తాయి. కానీ, ప్రభుత్వ సంస్థలు జగన్‌ సర్కారు ఒత్తిడికి తలొగ్గి తక్కువ వడ్డీకి వేలకోట్ల రూపాయలు తీసుకెళ్లి స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేశాయి. డబ్బులు వెనక్కి రాకపోవడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నాయి.


అక్కచెల్లెమ్మలకు టోపీ

జగన్‌ సర్కారు మొదట కాజేసింది డ్వాక్రా మహిళల డబ్బునే. స్త్రీ నిధి క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ నుంచి రూ.750 కోట్లు స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్లు చేయించుకున్నారు. 2020-21లో రూ.200 కోట్లు, 2023-24లో రూ.550 కోట్లు లాగేసుకున్నారు. ఇప్పటి వరకూ స్త్రీ నిధికి నయాపైసా కూడా తిరిగి చెల్లించలేదు.

కార్మికులకు టోకరా

భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం కాంట్రాక్టర్లు కాంట్రాక్టు విలువలో ఒక శాతాన్ని లేబర్‌ సెస్‌ కింద జమ చేస్తారు. ఈ నిధులను కార్మికుల ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్లు, ఇతర లోన్లు అవసరాల కోసం వాడాలి. కానీ జగన్‌ సర్కారు కార్మికుల నిధులను కూడా వదల్లేదు. ఏపీ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 2020-21లో ఏపీఎ్‌సఎ్‌ఫసీలో రూ.240 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు. మూడేళ్లు దాటినా ఒక్క రూపాయి వెనక్కి ఇవ్వలేదు.

ఎక్కువ వడ్డీకి తెచ్చి...

రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఉన్నవాటిని అభివృద్ధి చేయడం ఏపీ మారిటైమ్‌ బోర్డు బాధ్యత. ఇందుకోసం ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ లాంటి సంస్థలు, ఎస్‌బీఐ లాంటి బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులను 11 నుంచి 12 శాతం వడ్డీకి తెస్తోంది. అలా తెచ్చిన డబ్బులను 4 నుంచి 5 శాతం వడ్డీకి ఎస్‌ఎ్‌ఫసీలో డిపాజిట్‌ చేస్తోంది. ఏపీ మారిటైమ్‌ బోర్డు రూ.1200 కోట్లను ఎస్‌ఎ్‌ఫసీలో డిపాజిట్‌ చేయగా, రూ.464 కోట్లే తిరిగిచ్చారు.

ఎండీసీ అప్పుల వేట

ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రెండు దఫాలుగా రూ.555 కోట్లు డిపాజిట్‌ చేసింది. మూడేళ్లవుతున్నా ఎస్‌ఎ్‌ఫసీ పైసా కూడా తిరిగివ్వలేదు. పైగా ఎండీసీలో వాటాలను అమ్మకానికి పెట్టి రహస్య విదేశీ ఇన్వెస్టర్‌ నుంచి రూ.7,000 కోట్లు అప్పు తెచ్చింది. ఎండీసీ తన విధులు పక్కనపెట్టి ప్రభుత్వానికి అప్పులు తెచ్చిపెట్టే బాధ్యతను భుజాలపై వేసుకుంది.

గుంటూరుపై దండయాత్ర

గుంటూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి కోటి రూపాయలు డిపాజిట్‌ చేయించుకున్నారు. గుంటూరు కలెక్టర్‌ నుంచి రూ.34 లక్షలు, పీడీ డ్వామా కార్యాలయం నుంచి రూ.23 లక్షలు, జిల్లా నీటి నిర్వహణ కార్యాలయం నుంచి రూ.13 లక్షలు, జిల్లా రెవెన్యూ కార్యాలయం నుంచి రూ.30 లక్షలు లాగేశారు. మూడేళ్లవుతున్నా ఇంతవరకు తిరిగి చెల్లించలేదు.

డిపాజిట్లు ఎటు మళ్లించారంటే..

33 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బలవంతంగా తెచ్చుకున్న డిపాజిట్లు మొత్తం రూ.4,736 కోట్లలో రూ.3,670 కోట్లను ఏపీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు 6 శాతం వడ్డీకి లోను రూపంలో ఇచ్చారు. ఏపీ టిడ్కోకు రూ.350 కోట్లు, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు, ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు లోను ఇచ్చారు. ఈ 4 కార్పొరేషన్లకు కలిపి మొత్తం రూ.4,320 కోట్ల లోను ్లఇచ్చారు. ఇందులో ఏ ఒక్క కార్పొరేషన్‌ కూడా ఇంతవరకు తిరిగి స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌కు అప్పులు చెల్లించలేదు. కానీ ఈ 4 కార్పొరేషన్ల నుంచి వడ్డీల రూపంలో రూ.296 కోట్లు వచ్చాయని ఎస్‌ఎ్‌ఫసీ చెప్తోంది. పైగా తాము డిపాజిట్లు తెచ్చిన ఆ 33 విభాగాలకు కలిపి రూ.246 కోట్లు వడ్డీలు చెల్లించామని పేర్కొంది.


లాక్కోవడమే కానీ...

జగన్‌ సర్కారు పలు కార్పొరేషన్లు, విద్యా సంస్థల నుంచి డిపాజిట్లు చేయించుకుని పైసా కూడా తిరిగి ఇవ్వలేదు.

‘నా బీసీలు’ అంటూ చెప్పుకొనే జగన్‌ సర్కారు మూడేళ్ల క్రితం కుమ్మరి/శాలివాహన కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.4 కోట్లు తీసుకుంది.

ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నుంచి మూడేళ్ల క్రితం రూ.103 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు.

ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు.

ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.60 కోట్లు తీసుకున్నారు.

ఏపీ స్టేట్‌ ఆగ్రో ఇండస్ర్టీస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.15.5 కోట్లు తీసుకున్నారు.

ఉన్నత విద్యామండలి నుంచి రూ.40.31 కోట్లు, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌ బోర్డు నుంచి రూ.40 కోట్లు తీసుకున్నారు.

అనంతపురం జేఎన్టీయూ నుంచి రూ.55 కోట్లు, కాకినాడ జేఎన్టీయూ నుంచి రూ.80 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు.

సెర్ప్‌ నుంచి రూ.71 లక్షలు లాగేశారు.

వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి రూ.400 కోట్లు, నన్నయ్య యూనివర్సిటీ నుంచి రూ.15 కోట్లు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు.

ఏపీ ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.80 కోట్లు, ఏపీ ఇండస్ర్టియల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.145 కోట్లు, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.5 కోట్లు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ నుంచి రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు.

వీళ్లూ బాధితులే...

ఏపీఎస్సీ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి రూ.16.78 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు. అడగ్గా అడగ్గా రూ.కోటి 78 లక్షలు మాత్రమే తిరిగిచ్చారు. మిగిలిన డబ్బు మాత్రం వెనక్కి ఇవ్వడం లేదు.

ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి రూ.189 కోట్లు డిపాజిట్‌ చేయించుకున్నారు. బోర్డు లేఖల మీద లేఖలు రాయడంతో రెండు విడతల్లో రూ.70 కోట్లు తిరిగిచ్చారు. ఇంకా రూ.119 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంది.

Updated Date - May 27 , 2024 | 05:04 AM