Share News

చార్జీలను మేం పెంచలేదు... పెంచం

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:42 AM

‘వైసీపీ హయాంలో సీఎం హోదాలో పెంచిన విద్యుత్తు చార్జీలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ధర్నాలకు పిలుపును ఇవ్వడమేంటి?’ అని మాజీ సీఎం జగన్‌ను విద్యుత్తు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రశ్నించారు.

చార్జీలను మేం పెంచలేదు... పెంచం

ఉనికి కోసమే వైసీపీ డ్రామాలు: గొట్టిపాటి

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో సీఎం హోదాలో పెంచిన విద్యుత్తు చార్జీలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ధర్నాలకు పిలుపును ఇవ్వడమేంటి?’ అని మాజీ సీఎం జగన్‌ను విద్యుత్తు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పెరిగిన విద్యుత్తు చార్జీలకు నిరసగా జగన్‌ ధర్నాకు పిలుపును ఇవ్వడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైసీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి వైసీపీ ముఖ్య నేతలు దూరంగా ఉన్న నేపథ్యంలో గొట్టిపాటి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్తు చార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచబోదని స్పష్టం చేశారు. 2019 నుంచి జగన్‌ ప్రభుత్వం ప్రజలపై రూ.35,000 కోట్ల భారాన్ని వేసిందన్నారు. అంతేకాకుండా రూ.1,20,000 కోట్ల నష్టాల్లోకి విద్యుత్తు రంగాన్ని తోసేసిందన్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈఆర్‌సీకి ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలను జగన్‌ పంపారని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రతిపాదనలు వచ్చిన 90 రోజుల్లోనే ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు చార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సిన ఈఆర్‌సీ... ఎన్నికల దాకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడమేంటని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈఆర్‌సీ విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయం తీసుకుందని జగన్‌ తెలియదా అని గొట్టిపాటి ప్రశ్నించారు. పీపీఏలను రద్దుచేసి విద్యుత్తు వాడకుండానే హైకోర్టు ఆదేశాల మేరకు రూ.8,000కోట్లను చెల్లించాల్సి వచ్చిందని, ఈ భారాన్నంతా ప్రజలపైనే వేశారన్నారు. ఇలా తప్పులన్నీ చేసి, తన పాలనాకాలంలో విద్యుత్తు చార్జీలు మోయలేనంతగా పెంచేసిన జగన్‌.. ఇప్పుడు తన తప్పుకు తానే నిరసన కార్యక్రమాలకు దిగడం తుగ్లక్‌ చేష్టలను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


చర్చకు రండి.. తప్పెవరిదో తేల్చేద్దాం: సవిత

‘జగన్‌ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్‌ చార్జీలు పెరిగాయి. ఆయన తుగ్లక్‌ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తన పార్టీ ఉనికి కోసం జగన్‌ సరికొత్త డ్రామాలు అడుతున్నారు. రూ.17 వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారం వేసిందే జగన్‌. ఆనాడు జగన్‌ చేసిన ఒప్పంద ఫలితమే నేడు కరెంటు చార్జీల్లో పెరుగుదల. 5ఏళ్ల జగన్‌ దరిద్రపు పాలనలో తొమ్మిది పర్యాయాలు విద్యుత్‌ చార్జీలు పెంచారు’ అని మంత్రి సవిత మంత్రి మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీల పెంపు పాపం ఎవరిదో తేలుద్దాం, దమ్ముంటే చర్చకు రావాలంటూ జగన్‌కు, సవిత సవాల్‌ విసిరారు.

వైసీపీ మోపిన భారమే: మంత్రి సంధ్యారాణి

‘వైసీపీ హయాంలో ప్రజలపై రూ.32వేల కోట్ల మేర చార్జీల భారం మోపారు. అవే ఇప్పటికీ బిల్లుల్లో వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పైసా కూడా పెంచలేదు. ఇప్పుడు పడుతున్న అదనపు భారం అంతా వైసీపీ ప్రభుత్వం మోపి పోయిందే. రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశాల వల్ల కొంతకాలం పాటు వాటిని వసూలు చేయడం తప్ప మార్గం లేదు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 04:42 AM