Share News

ఆడపిల్లలకు అండ

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:54 AM

ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం తెలుగుదేశం పార్టీ సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. టీడీపీ అధికారంలోకి వస్తే.. యువతులు విదేశాలకు వెళ్లి చదువుకోవడంతో పాటు ఏ కోర్సు చేసినా అందుకయ్యే ఖర్చుకు ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తుందని,

ఆడపిల్లలకు అండ

వారి ‘కలలకు రెక్కలు’ ఇచ్చే దిశగా అడుగులు

బ్యాంకు రుణాలకు ప్రభుత్వమే గ్యారెంటీ.. వడ్డీ కూడా పూర్తిగా మాఫీ

విదేశీ చదువులతో పాటు ఏ కోర్సుకైనా సాయం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా ఇతర ప్రభుత్వ పథకాలకు ఇది అదనం

లబ్ధిదారులపై పరిమితి లేదు.. ఎన్ని లక్షల మందికైనా ఇస్తాం: బాబు

విద్యార్థినుల రిజిస్ట్రేషన్లు షురూ.. ఇప్పటికి 12 వేల మంది నమోదు

వారి ‘కలలకు రెక్కలు’.. టీడీపీ కొత్త హామీ

అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం తెలుగుదేశం పార్టీ సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. టీడీపీ అధికారంలోకి వస్తే.. యువతులు విదేశాలకు వెళ్లి చదువుకోవడంతో పాటు ఏ కోర్సు చేసినా అందుకయ్యే ఖర్చుకు ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తుందని, వడ్డీని కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకానికి ‘కలలకు రెక్కలు’ అని పేరు పెట్టారు. దీని కింద లబ్ధి పొందేవారి సంఖ్యపై పరిమితి లేదని, ఎన్ని లక్షల మంది ఆడపిల్లలు ముందుకొచ్చినా అందరికీ దీనిని వర్తింపజేస్తామని మాజీ సీఎం తెలిపారు. ఈ పథకం కింద సాయం కావాలనుకునే విద్యార్థినుల రిజిస్ట్రేషన్‌ను బుధవారం ఇక్కడ ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ప్రారంభించారు. ‘కలలకు రెక్కలు. కామ్‌’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను దీని కోసం ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటికి పన్నెండు వేల మంది విద్యార్థినులు నమోదు చేసుకున్నారని, దీనికి వస్తున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా ఇతర ప్రభుత్వ పథకాలకు ఇది అదనమని, ఆ పథకాలు వర్తించే అవకాశం లేనిచోట దీనిని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ‘సాధారణంగా ప్రభుత్వ పథకాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. అపరిమితంగా సాయం చేయలేం. అయితే తాజా స్కీంకు అటువంటి పరిమితులు లేవు. కొన్ని కోర్సులకు ఫీజుల పథకం వర్తించదు. ఒక కోర్సు చదివిన తర్వాత అందులో మరింత జ్ఞానం సంపాదించడానికి మరికొన్ని కోర్సులు చేయాల్సి వస్తుంది. వాటన్నిటికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. దీనికింద ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తాం’ అని ఆయన వివరించారు.

ఆడ పిల్లలను బాగా చదివించి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కుటుంబాలతోపాటు సమాజం కూడా ముందుకు వెళ్తుందన్నారు. ‘40 ఏళ్ల కిందట ఎన్టీఆర్‌ తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళల్లో నాయకత్వం పెంపొందించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళలకు ఏభై శాతం రిజర్వేషన్లు రావడానికి ఎన్టీఆర్‌ చొరవ కారణం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుల్లో, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాను. దానివల్ల విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో మహిళలు పెరిగారు. పేద కుటుంబాల్లో మహిళలు వారి కాళ్లపై వారు నిలబడటానికి డ్వాక్రా ఉద్యమాన్ని పెంపొందించాం. ఐటీకి ప్రోత్సాహం పెంచి ఐటీలో ఉద్యోగాలు బాగా దొరికే వాతావరణం కల్పించిన తర్వాత ఆడపిల్లలు అందులో బాగా రాణిస్తున్నారు. మంచి ఉద్యోగం ఉంటే కట్నం అడగడం లేదు. ఆడపిల్లలు తమ భర్తను తాము ఎంచుకునే పరిస్థితులు దీనివల్ల వచ్చాయి. విదేశాల్లో అవకాశాలు ఇంకా పెరిగాయి. మంచి విద్యా సంస్థల్లో చదువుకుంటే ఇంకా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకే వారికి బాగా చదువుకోవడానికి సాయం చేసేందుకు ఒక పథకం ఉంటే బాగుంటుందని దీనిని తీసుకొచ్చాం’ అని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భావన మాట్లాడారు. ‘నేను ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్నాను. మేం కొత్త విషయాలు నేర్చుకోవడానికి సర్టిఫికేషన్‌ కోర్సులు చేయాలి. వాటికి మా జీతం నుంచి చెల్లించాలి. ఖర్చు ఎందుకని వదిలేస్తుంటాం. ఇప్పుడు టీడీపీ పెట్టిన పథకంతో వాటిని పూర్తిచేయడానికి అవకాశం వస్తోంది. ఇది మంచి ఆలోచన’ అని అన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 04:54 AM