Share News

ప్రిన్సిపాల్‌ పదోన్నతుల్లో గోల్‌మాల్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:35 AM

జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్‌ పదోన్నతుల్లో అక్రమాలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరికే పదోన్నతులు కట్టబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రిన్సిపాల్‌ పదోన్నతుల్లో గోల్‌మాల్‌

ఇంటర్‌ విద్యాశాఖలో కలకలం

అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్‌ పదోన్నతుల్లో అక్రమాలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరికే పదోన్నతులు కట్టబెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడేందుకు ఒక సీనియర్‌ మంత్రి సహకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ మూడు కేటగిరీలను కలిపి ఇంటిగ్రేటెడ్‌ సీనియారిటీ జాబితా ద్వారా పదోన్నతులు కల్పించే విధానం ఉంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌(డీఆర్‌), నాన్‌-టీచింగ్‌, టీచర్‌ ప్రమోటీలకు కలిపి ఒకే సీనియారిటీ జాబితా ఉంటుంది. అయితే 2000సంవత్సరం తర్వాత టీచర్లకు జూనియర్‌ లెక్చరర్లుగా పదోన్నతులిచ్చే విధానం ఆగిపోయింది. అప్పటికే జేఎల్‌ అయినవారు జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఆర్‌ కోటాలో కొందరు జేఎల్స్‌గా వచ్చారు. ఇప్పుడు అందరికీ కలిపి ఇంటిగ్రేటెడ్‌ సీనియారిటీ జాబితా అమలుచేయాల్సిన ఇంటర్‌ విద్యాశాఖ... అందులో టీచర్‌ ప్రమోటీలను తొలగించినట్లు తెలిసింది. దానివల్ల వారికంటే ఆలస్యంగా ఉద్యోగాలు పొందిన డీఆర్‌ కోటా జేఎల్స్‌ పదోన్నతి పొందుతారు. రాష్ట్రవ్యాప్తంగా 210 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ సీనియారిటీ జాబితాను అమలుచేస్తే సుమారు 120 మంది టీచర్‌ ప్రమోటీలు ప్రిన్సిపాళ్లు అవుతారు. వారిని తొలగించడంతో ఆ పదోన్నతులు డీఆర్‌ కోటాకు వెళ్లిపోతాయి. దీనిపై అధికార పార్టీకే చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పందించిన సీఎంవో వివరణ ఇవ్వాలని ఇంటర్‌ విద్యాశాఖను ఆదేశించింది. ఈలోగానే పదోన్నతులు ఇచ్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Feb 17 , 2024 | 09:41 AM