Share News

పిఠాపురంలో వైసీపీ నేతల ఇళ్లలో గోవా మద్యం

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:42 AM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నేతల ఇళ్లలో భారీగా మద్యం నిల్వలను సెబ్‌ అధికారులు పట్టుకున్నారు.

 పిఠాపురంలో వైసీపీ నేతల ఇళ్లలో గోవా మద్యం

రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత

పిఠాపురం, ఏప్రిల్‌ 26: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నేతల ఇళ్లలో భారీగా మద్యం నిల్వలను సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. మొత్తం రూ.80లక్షల విలువైన మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో పిఠాపురంలో ఆయన ఓటమే లక్ష్యంగా వైసీపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నారు!. ఇప్పటికే డబ్బు ఇతర కానులకలతో ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇదే కోవలో ఓటర్లకు పంచేందుకు ఇతర ప్రాంతాలనుంచి భారీగా మద్యం తెచ్చి పలుచోట్ల నిల్వ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న స్టేట్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీసు అధికారులు పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీ, సాలిపేట, వైఎస్సార్‌ గార్డెన్స్‌లతోపాటు పిఠాపురం మండలం కుమారపురంలో.. మొత్తం నాలుగు ఇళ్లపై శుక్రవారం రాత్రి ఏకకాలంలో దాడి చేశారు. మొత్తం 1015 బాక్సుల్లో ఉన్న 48,720 మద్యం బాటిళ్లను సెబ్‌, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు ఇళ్లూ వైసీపీకి చెందిన వారివే కావడంతో ఆ పార్టీకి చెందిన నాయకులే ఇక్కడకు తెచ్చి మద్యాన్ని నిల్వ చేసినట్లు చెబుతున్నారు. వీటి విలువ రూ.80లక్షలకు పైగా ఉంటుందని అంచనా. పవన్‌పై గెలవలేమని తెలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఇటువంటి కుట్రలకు తెరలేపారని, దీనివెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. మద్యం నిల్వలు వెనుక ఉన్న గీతను అరెస్టు చేయాలన్నారు. అలాగే, నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీగా మద్యం, నగదును డంప్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 27 , 2024 | 03:42 AM