Share News

గాజుగ్లాసు జనసేనకే కేటాయించాలి!

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:56 AM

గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకి మాత్రమే కేటాయించాలని, ఆ పార్టీ పోటీలో లేని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు,

గాజుగ్లాసు జనసేనకే కేటాయించాలి!

ఆ పార్టీ లేనిచోట స్వతంత్రులకు ఇవ్వొద్దు

సీఈవోకు ఎన్డీయే కూటమి వినతి

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకి మాత్రమే కేటాయించాలని, ఆ పార్టీ పోటీలో లేని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు, ఏ ఇతర పార్టీల అభ్యర్థులకూ ఆ గుర్తును కేటాయించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాను ఎన్డీయే కూటమి కోరింది. బుధవారం అమరావతి సచివాలయంలో సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనాకు టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చిరాంప్రసాద్‌, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరుగరి జ్యోత్స్న ఎన్డీయే కూటమి తరఫున వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ప్రజల్లో కన్ఫ్యూజన్‌ లేకుండా ఉండాలంటే గాజుగ్లాసు గుర్తు వేరే వాళ్లకు కేటాయించకూడదన్నారు. జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించవదని సీఈవోను కోరామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దీనిపై లేఖ పంపామని చెప్పారు. ఒక గుర్తు ఒకరికి కేటాయించిన తర్వాత కన్ఫ్యూజన్‌ లేకుండా ఉండాలంటే వేరే వారికి ఆ గుర్తు కేటాయించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, ఆధారాలను సీఈవోకు ఇచ్చామని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ డీజీ, విజయవాడ సీపీలను మార్చినందుకు సీఈవోకు కృతజ్ఞతలు చెప్పామని, సీఎస్‌, డీజీపీలను కూడా మార్చాలని కోరామని తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 08:02 AM