Share News

ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండి

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:18 AM

సామాజిక పింఛన్లు అందుకునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి వారికి అందరికీ ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండి

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు బాబు లేఖ

ఇంటింటి పంపిణీకి సరిపడా సిబ్బంది ఉన్నారు

అయినా సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి

కావాలనే అడ్డుపడుతున్నారు

ఈయన మంత్రి బుగ్గన బంధువు

వ్యవహారం వెనుక కుట్ర: బాబు.. సీఎస్‌, సీఈవోలకూ ఫోన్లు

పింఛన్ల జాప్యం వైసీపీ కుట్రే.. రాజకీయ లబ్ధి కోసమే

అవ్వాతాతలకు కష్టాలు.. ప్రజలకు బాబు బహిరంగ లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్లు అందుకునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి వారికి అందరికీ ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇంటింటి పంపిణీకి సరిపడా ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉన్నా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో మురళీధర్‌రెడ్డి కావాలనే అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై బురదజల్లే దురుద్దేశంతోనే ఆయన దీనికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు ఆయన లేఖ రాశారు. ‘ఇప్పటిదాకా వలంటీర్ల ద్వారా పింఛనుదారులకు వారి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఇటీవల ఎన్నికల కమిషన్‌ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీని నిలిపివేసింది. ఈ క్రమంలో గ్రామ/వార్డు సచివాలయాల వద్ద ఈ పింఛన్ల పంపిణీ చేయాలని దీనిని పర్యవేక్షిస్తున్న సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడానికే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉంది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి టీడీపీ కారణమని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇళ్ళ వద్దకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాను. ఆయన దీనిపై కలెక్టర్ల సమావేశం నిర్వహించి చర్చించారు. వారు కూడా అంగీకరించారు. సచివాలయాల సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంది.

కానీ వీటి పంపిణీకి నోడల్‌ అధికారిగా ఉన్న సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డి అడ్డుపడుతున్నారు. ఈయన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి బంధువు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో కూడా ఆయన సహనిందితుడిగా ఉన్నారు. టీడీపీపై బురదజల్లడానికి వీలుగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీని అడ్డుకోవాలని జగన్‌ ప్రభుత్వం మురళీధర్‌రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తోంది. తదనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు 40 డిగ్రీల సెల్సియ్‌సను మించి ఉన్నాయి. ఈ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, తదితరులు నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం వారికి చాలా ఇబ్బందికరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎ్‌సను ఆదేశించండి’ అని అందులో కోరారు. కాగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనాకు చంద్రబాబు మంగళవారం ఉదయం ఫోన్లు చేశారు. పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలని వారిద్దరికీ విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్‌ ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదని సీఎ్‌సకు గుర్తుచేశారు. పింఛన్ల విషయంలో ప్రజల సౌలభ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు.

జగన్‌రెడ్డిది ఫేక్‌ బతుకు..

జగన్‌రెడ్డిది ఫేక్‌ బతుకని చంద్రబాబు ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం, అవాస్తవాల దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన మనస్తత్వం ఆయన డీఎన్‌ఏలో, వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని ‘ఎక్స్‌’లో విరుచుకుపడ్డారు. ‘ఇళ్ల వద్ద పింఛన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా చెప్పలేదు. ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్‌ కూడా ఆదేశించలేదు. తమ రాజకీయ అవసరాల కోసం వృద్ధులు, దివ్యాంగులు, రోగులను ఇబ్బంది పెట్టడానికి కూడా జగన్‌ ప్రభుత్వం వెనకాడడం లేదు. మేం అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలు చేస్తాం. ఇళ్ల వద్దనే ఇస్తాం’ అని స్పష్టం చేశారు.

పింఛన్లపై బాబు ఫోన్‌ సందేశం

సామాజిక పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొడుతూ చంద్రబాబు ఒక ఫోన్‌ సందేశాన్ని కూడా విడుదల చేశారు. అందులో జగన్‌కు సవాల్‌ విసిరారు. ‘పేదల పింఛన్లను వారి ఇళ్ల వద్ద ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నావో ఈ సీఎం సమాధానం చెప్పాలి. లక్షా 30 వేల మంది సచివాలయ సిబ్బందితో పేదల ఇళ్ల వద్ద ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారు? కేవలం టీడీపీపై బురదజల్లడానికే పేదలను ఇబ్బంది పెడుతున్నారు. డబ్బు వచ్చాక కూడా ఇంటి వద్దకు పంపడం చేతకావడం లేదు. మీరు ఇవ్వలేకపోతే మేం వచ్చాక.. ఈ రెండు నెలల మొత్తం కూడా కలిపి ఇస్తాం’ అని తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 04:18 AM