నాపై ఉన్న కేసుల వివరాలివ్వండి
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:56 AM
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంది.

డీజీపీకి చంద్రబాబు లేఖ
అన్ని జిల్లాల ఎస్పీలు, సీఐడీ, ఏసీబీలకూ...
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంది. కావున గత ఐదేళ్లలో నాపై ఉన్న కేసుల వివరాలను మీ కార్యాలయం ద్వారా అందించండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర డీజీపీతోపాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకూ లేఖ రాశారు. ‘గత ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. సంబంధిత ఏజెన్సీలు, అధికారులు పెట్టిన కేసుల సమాచారం నాకు అందలేదు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్షనేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయండి. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా వివరాలు తెలియజేయగలరు. వ్యక్తిగతంగా నేను ప్రతి పోలీసు స్టేషన్ నుంచి సమాచారం పొందడం అన్నది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి డీజీపీ కార్యాలయం ద్వారా సమాచారం ఇవ్వగలరు’ అని చంద్రబాబు కోరారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే చంద్రబాబు లేఖ రాసి వివరాలు కోరారు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు ఆ మేరకు చర్యలు తీసుకున్నారు.