Share News

పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:44 AM

పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి

కేంద్ర కేబినెట్‌తో ఆమోదింపజేయండి.. జలశక్తి మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి

కొత్త డయాఫ్రం వాల్‌పై ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచాం

ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర మంత్రివర్గ నోట్‌ను అందజేశాం

తొలి దశ, మలిదశ లేవు.. మొత్తం పూర్తిచేయడమే మా ముందున్న లక్ష్యం

3 నెలల్లో పనులపై నిర్ణయం తీసుకోవాలి.. లేదంటే మరో సీజన్‌ కోల్పోతాం

జగన్‌ పాలనలో రాష్ట్రం దిగజారింది.. కేంద్ర నిధులను దారి మళ్లించింది

తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణానికి సాయం కోరుతున్నాం

విభజన చట్టంలో ఉన్నవే చేశారు.. మాకు కొత్తగా చేసిందేమీ లేదు: సీఎం

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. శనివారం, ఇక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్రమంత్రితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. నవంబర్లో పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఆ మేరకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు తెలిపారు. ‘కొత్త వాల్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. దాని నిర్మాణానికి అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని, ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్‌లో కూడా చర్చించామని, కేబినెట్‌ నోట్‌ను కేంద్ర మంత్రికి అందించినట్లు చెప్పారు. పోలవరంపై నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు ఆమోదం తెలిపిందని, ఇప్పుడది కేంద్ర కేబినెట్‌ ముందుకు వెళ్లాల్సి ఉందని వివరించారు. ’పోలవరం ప్రాజెక్టులో ముందు డయాఫ్రం వాల్‌ కొత్తది నిర్మించాలి. ఆ తర్వాత ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మించాలి. కాఫర్‌ డ్యాంలు కొంత తగ్గించి.. సీపేజ్‌ అంతా ఎత్తిపోస్తూ.. వాల్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు సీజన్ల కంటే ముందే.. దీనిని కట్టేస్తే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు వెంటనే చేపట్టవచ్చు. ప్రాజెక్టులో తొలిదశ, మలిదశ అనేవి లేవు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం ఒక్కటే మా లక్ష్యం. చేపట్టాల్సిన పనుల్లో ముందు ఏవి పూర్తి చేయాలనేందుకే దశలుగా పేర్కొంటున్నాం. ప్రాజెక్టు పనులపై మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే.. మరో సీజన్‌ కూడా కోల్పోయే అవకాశం ఉంది. వరద తగ్గిన వెంటనే పనులు మొదలు పెడితే పనులు కొలిక్కి రావడానికి రెండు సీజన్లు పడుతుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.

జగన్‌ పాలనలో సర్వనాశనం

విభజన చట్టంలో అంశాలన్నీ అమలు చేస్తున్న దశలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిందని.. ఇప్పుడు విభజన నాటి పరిస్థితి కంటే రాష్ట్రం ఇంకా దిగజారిపోయిందని చంద్రబాబు తెలిపారు. అప్పులు చేయడం, తలసరి ఆదాయం తగ్గిపోవడం, పోలవరం నాశనం, అమరావతి నాశనం, పరిశ్రమలు పారిపోవడం వంటివన్నీ జరిగాయని చెప్పారు. స్వచ్ఛ భారత్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాల్లో గత ఐదేళ్లలో ఏపీ అనేక రాష్ట్రాల కంటే వెనుకబడిందని, చివరి నుంచి మూడో స్థానంలో ఉందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని, కేంద్రంలో ఏ శాఖ దగ్గరకు వెళ్లినా.. రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారని అన్నారు. ‘గడచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన స్థితికి ఏపీ పడిపోయింది. తలసరి ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల, జగన్‌ విధ్వంస పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నాం. విభజన నుంచి తేరుకుని రాష్ట్రాన్ని మేం బాగు చేస్తున్న సమయంలో ప్రజలు ఆయన(జగన్‌)కు అవకాశం ఇచ్చారు. మొత్తం నాశనం చేశాడు. ఆయన ఐదేళ్ల పాలన చూసి మాకు చరిత్రాత్మక విజయాన్ని ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను మాకు అప్పగించారు. ఇప్పుడు ఏ శాఖకు వెళ్లినా.. గత ప్రభుత్వ నిర్వాకాలపై మమ్మల్ని అడుగుతున్నారు. జరిగిన తప్పిదాలకు వైసీపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేంద్రం కొత్తగా ఇచ్చింది లేదు..

ఏపీకి ఇచ్చినవాటిపై రాజకీయమా?

కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు సరికాదు

ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ కూడా కారణం: సీఎం

ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో చేసిన సాయంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. తమ రాష్ట్రానికిఇచ్చిన వాటిపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ‘రాష్ట్రానికి రావలసిన పాత బకాయిలే అడుగుతున్నాం తప్ప.. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. విభజన నష్టం కంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. విభజన చట్టంలో ఉన్న అమరావతి, పోలవరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది, పెట్టుబడులు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టం చేసే సమయంలో కాంగ్రెస్‌ చెప్పింది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం.. విభజన చట్టంలో చెప్పిన అన్నింటినీ చేయాలని అడిగాం.. అదే చేశారు. ఏపీ పరిస్థితికి కాంగ్రె్‌సది కూడా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పానని.. తెలంగాణకు, ఆంధ్రకు తలసరి ఆదాయంలో సుమారు రూ.30 వేలు తేడా ఉందని, దాన్ని సరిదిద్దడం కోసమే విభజన చట్టంలో అన్ని అంశాలు చేర్చారని వెల్లడించారు.

జస్టిస్‌ ఎన్వీ రమణతో చంద్రబాబు భేటీ

శనివారం సాయంత్రం వరకు నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... అనంతరం జలశక్తి మంత్రి పాటిల్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి తమ అనుభవాలను కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ కుటుంబ సభ్యులతోనూ ముఖ్యమంత్రి ముచ్చటించారు.

Updated Date - Jul 28 , 2024 | 03:44 AM