Share News

‘జర్మన్‌ వర్సిటీ’ జంతర్‌మంతర్‌!

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:16 AM

కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వంలోనైనా సాధారణ విషయమే.

‘జర్మన్‌ వర్సిటీ’ జంతర్‌మంతర్‌!

లేని యూనివర్సిటీతో ఒప్పందం

హేమచంద్రారెడ్డి అడ్డగోలు వైఖరి

జగన్‌ ఏలుబడిలో వింత వ్యవహారం

వెబ్‌సైట్‌ను వర్సిటీ అంటూ కార్యక్రమాలు

దాని యజమాని గోదావరి జిల్లాల వ్యక్తి

‘మధ్యవర్తి’గా ఆర్థిక ప్రయోజనాలు

ఇప్పుడూ పాగా వేసేందుకు యత్నం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వంలోనైనా సాధారణ విషయమే. అసలు మనుగడలో లేని యూనివర్సిటీని ఉన్నట్టుగా చూపించి ఒప్పందాలు చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా? ఇది.. గత జగన్‌ ప్రభుత్వంలోనే సాధ్యం! ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి ఇలాంటి ఘనకార్యాలు అనేకం చేశారు. ‘జర్మన్‌ వర్సిటీ’ అనే వెబ్‌సైట్‌తో ఒప్పందం చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. జర్మనీలోని యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులు చదువుకునేందుకు మార్గం సుగమం చేయడం దీని ఉద్దేశం. ఇందుకోసం పలుమార్లు జర్మనీ యూనివర్సిటీలతో ఆన్‌లైన్‌ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులు నిర్వహించేందుకు ఆ యూనివర్సిటీలకు, ఉన్నత విద్యామండలికి మధ్య ‘జర్మన్‌ వర్సిటీ’ వేదికగా వ్యవహరించింది. అది కేవలం ఒక వెబ్‌సైట్‌ మాత్రమే. కానీ దానినే ఒక యూనివర్సిటీ అన్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రచారం చేసింది. ఆ వెబ్‌సైట్‌ కూడా తమది ఒక యూనివర్సిటీ అన్నట్టుగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందింది. ఆ వెబ్‌సైట్‌కు, హేమచంద్రారెడ్డికి మధ్య సంబంధం ఏంటి? అని ఆరా తీస్తే.. ఆ జర్మన్‌ వర్సిటీ అధినేత గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి అని తెలిసింది. పేరుకు జర్మన్‌ వర్సిటీ అని పెట్టుకున్నా గత ప్రభుత్వంలో ఆయన ఎక్కువగా ఉన్నత విద్యామండలిలోనే ఉండేవారు. జర్మనీకి చెందిన పలు యూనివర్సిటీలతో చేసుకున్న ఒప్పందాలకు ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారు. ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన్ను ఎందుకు మధ్యవర్తిగా పెట్టారన్న విషయాన్ని అప్పటి చైర్మన్‌ రహస్యంగా ఉంచారు. ఆన్‌లైన్‌లో సదస్సులు నిర్వహించినందుకు ఉన్నత విద్యామండలి బిల్లులు చెల్లించినట్లు తెలిసింది. అలాగే జర్మనీకి వెళ్లాలనుకునే విద్యార్థులకు కోర్సులు అందిస్తామంటూ సదరు వ్యక్తి లబ్ధి పొందారు. అంతటితో ఆగకుండా ఉన్నతాధికారులు, కొన్ని యూనివర్సిటీల వీసీలు, హేమచంద్రారెడ్డి లాంటి వారిని జర్మనీ పర్యటనకు తీసుకెళ్లారు. పేరుకు అధికారిక పర్యటన అయినా అది ఆసాంతం వ్యక్తిగతంగానే సాగింది. పర్యటన అనంతరం ఏయే ఒప్పందాలు చేసుకున్నారని మీడియా ప్రతినిధులు అడిగినా అప్పటి చైర్మన్‌ సమాధానం ఇవ్వలేదు. ఉన్నత విద్యామండలి నిధులు మాత్రం దుర్వినియోగం చేశారు. ఈ ప్రభుత్వంలోనూ ఉన్నత విద్యామండలిలో మళ్లీ చక్రం తిప్పేందుకు ఆ లేని యూనివర్సిటీ యజమాని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ద్వారా మళ్లీ ఆన్‌లైన్‌ సదస్సులంటూ ఒప్పందాలు చేసుకోవాలని చూస్తున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 05:16 AM