Share News

అక్కడ చెత్త... ఇక్కడ రొయ్యలకు మేత..!

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:48 AM

విశాఖపట్నం కేంద్రంగా ‘ఈస్ట్‌’ భారీఎత్తున దిగుమతి అవుతోంది. నెలకు సుమారు ఐదు నుంచి ఆరు కంటెయినర్లు యూరోపియన్‌ దేశాల నుంచి వస్తోంది.

అక్కడ చెత్త... ఇక్కడ రొయ్యలకు మేత..!

విశాఖ కేంద్రంగా భారీఎత్తున డ్రై ఈస్ట్‌ దిగుమతి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం కేంద్రంగా ‘ఈస్ట్‌’ భారీఎత్తున దిగుమతి అవుతోంది. నెలకు సుమారు ఐదు నుంచి ఆరు కంటెయినర్లు యూరోపియన్‌ దేశాల నుంచి వస్తోంది. వండిన ఆహార పదార్థాలను పక్కనపడేస్తే ‘ఈస్ట్‌’ తయారవుతుంది. గోధుమలతో తయారైన రొట్టెలు, పిజ్జాలు, బర్గర్లు పాడైపోతే వచ్చే ఈస్ట్‌లో పోషక పదార్థాలుంటాయి. వాటిని రొయ్యలు, చేపలు, కోళ్లఫారాలలో ఫీడ్‌ కింద ఉపయోగిస్తారు. అయితే యూరోపియన్‌ దేశాల్లో ఈ చెత్తను త్వరగా వదిలించుకోవడానికి అతి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు. మన దగ్గర చికెన్‌ దుకాణాల్లో వ్యర్థాలను అమ్మినట్టు... అక్కడి రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాల వ్యర్థాలను ఉచితంగా ఇచ్చేస్తారు. అది ఈస్ట్‌గా మారిన తర్వాత పౌడర్‌ రూపంలోకి మార్చి (డ్రై ఈస్ట్‌) ఇతర దేశాలకు పంపేస్తారు. అతి తక్కువ ధరకు లభించడంతో ఏపీలోని ఆక్వా కల్చర్‌, కోళ్లఫారాలు నడిపేవారు దీన్ని దిగుమతి చేసుకుంటున్నారు. విశాఖలోని కంటెయినర్‌ టెర్మినల్‌కి ప్రతి నెలా ఐదు నుంచి ఆరు కంటెయినర్లు (ఒక్కొక్కటి 25 టన్నులు) దిగుమతి అవుతున్నాయి. విశాఖలో ఆక్వాకల్చర్‌ వ్యాపారం చేసేవారితో పాటు భీమవరం తదితర ప్రాంతాల్లో రొయ్యలు సాగుచేసే వారూ ఈస్ట్‌ని భారీగా తెప్పించుకుంటున్నారు.

యానిమల్‌ ఫీడ్‌ పేరుతో రప్పించారు: ఆక్వాకల్చర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వ్యాపారంలో రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ సంస్థ యానిమల్‌ ఫీడ్‌ ఫేరుతో ‘డ్రై ఈస్ట్‌’ని 25 వేల కిలోలు తెప్పించుకుంది. అందులో డ్రగ్స్‌ ఉన్నాయని సమాచారం అందడంతో సీబీఐ రంగంలో దిగింది. ఈ నెల 16నే కంటెయినర్‌ పోర్టుకు చేరింది. దాన్ని పక్కనపెట్టి విచారణ ప్రారంభించారు. దిగుమతిదారుల సమక్షంలోనే తెరిచి డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించి సీజ్‌ చేశారు. చాలాకాలంగా ఇలా డ్రై ఈస్ట్‌ని తెప్పిస్తున్నట్టు పోర్టు వర్గాల సమాచారం. అందులో డ్రగ్స్‌ ఉన్నట్టు ఇప్పుడే తేలింది. ఇలా ఎప్పటినుంచి జరుగుతుందో తేలాల్సి ఉంది. అయితే కోళ్ల వ్యర్థాలను చేపల పెంపకానికి వాడుతున్నట్టే... విదేశాల్లో పిజ్జాలు, బర్గర్ల చెత్తను రొయ్యలకు మేతగా వాడుతున్నట్టు తాజాగా నిర్ధారణ అయింది.

Updated Date - Mar 22 , 2024 | 09:37 AM