Share News

గంగవరం... గరంగరం!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:22 AM

అదానీ గంగవరం పోర్టులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్వాసిత కార్మికులు రెండు గేట్లకు తాళాలు వేసి, వారం రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి

గంగవరం... గరంగరం!

వారం రోజులుగా నిర్వాసిత కార్మికుల ఆందోళన..

పోర్టు వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): అదానీ గంగవరం పోర్టులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్వాసిత కార్మికులు రెండు గేట్లకు తాళాలు వేసి, వారం రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున సమక్షంలో 8నెలల క్రితం చర్చలు జరిగాయని, తమ డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, కానీ ఇంతవరకూ వాటిని నెరవేర్చకపోవడం వల్లే ఆందోళన చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. నాడు మధ్యవర్తులుగా ఉన్న మంత్రి, కలెక్టర్‌.. ఇప్పుడు స్పందించడం లేదని, యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు. పదిహేనేళ్ల నుంచి పనిచేస్తున్నా రూ.30వేల జీతం రావడం లేదని, బేసిక్‌ పే రూ.4 వేలు కూడా లేదని వాపోతున్నారు. విశాఖపట్నం పోర్టులో అదే పనిచేస్తున్న వారికి రూ.17వేల బేసిక్‌ పే ఇస్తున్నారని, తమకు ఎందుకివ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. తమ జీవనోపాధిని పోగొట్టుకొని పోర్టు కోసం భూములు ఇచ్చామని, యాజమాన్యానికి భారీ లాభాలు వస్తున్నా వేతనాలు ఎందుకు పెంచరని ప్రశ్నిస్తున్నారు.

లోపల వంద మందికి పైగా కార్మికులు

వారం రోజుల క్రితం యాజమాన్య వైఖరిని నిరసిస్తూ నిర్వాసిత కార్మికులు ఆకస్మికంగా పోర్టు గేట్లకు తాళాలు వేశారు. ఆ సమయంలో పోర్టు లోపల 100 మందికి పైగా కార్మికులు, 20మంది పోర్టు అధికారులు ఉన్నారు. గేట్ల ముందే బైఠాయించి ఆందోళన చేస్తుండటంతో పోర్టులో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇలా ఆందోళన పెరుగుతుండటంతో విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం రాత్రి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మరిన్ని బలగాను మోహరించారు.

Updated Date - Apr 18 , 2024 | 03:22 AM