Share News

గంగలా గోదావరి, కృష్ణా!

ABN , Publish Date - May 26 , 2024 | 01:43 AM

దేశంలోని ప్రధాన నదులు గోదావరి, కృష్ణా, నర్మదా, మహానది, కావేరి, పెరియార్‌లను గంగా నది తరహాలోనే పరిశుభ్రం చేసి సంరక్షించాలన్న యోచనలో ఉన్నట్టు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గంగలా గోదావరి, కృష్ణా!

నదుల సంరక్షణపై కేంద్ర జలశక్తి దృష్టి

మరో 4 ప్రధాన నదులు కూడా .. ఐఐటీలకు అధ్యయన బాధ్యతలు

31న షెడ్యూల్‌ అడ్వైజరీ కమిటీ భేటీ.. సీఎ్‌సకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ

అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రధాన నదులు గోదావరి, కృష్ణా, నర్మదా, మహానది, కావేరి, పెరియార్‌లను గంగా నది తరహాలోనే పరిశుభ్రం చేసి సంరక్షించాలన్న యోచనలో ఉన్నట్టు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయా నదీ ప్రాంత రాష్ట్రాలకు ఈ విషయాన్ని తెలియజేసింది. గంగా నది తరహాలో ప్రధాన నదులను సంరక్షించాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీన షెడ్యూల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ప్రతినిధిని పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డికి ఈ నెల 20వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ ప్రదీ్‌పకుమార్‌ అగర్వాల్‌ లేఖ రాశారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని ఈ నెల 17న నిర్వహించాల్సి ఉండగా 23కు వాయిదా వేశారు. తాజాగా 31న నిర్వహించాలని నిర్ణయించారు. నదీ సంరక్షణ అధ్యయన బాధ్యతలను ఐఐటీలకు అప్పగించారు. గోదావరి నదీ జలాల సంరక్షణను నాగపూర్‌ ఎన్‌ఈఈఆర్‌ఐకు అప్పగించారు. ఈ సంస్థ అధ్యయన వివరాలను తెలుసుకునే బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్‌కు అప్పగించారు. అలాగే కృష్ణా నదీ సంరక్షణపై అధ్యయన బాధ్యతను వరంగల్‌ ఎన్‌ఐటీకి, పరిశీలనా బాధ్యతను ఎన్‌ఐటీ సూరత్‌కల్‌కు అప్పగించారు. కావేరి నదీ జలాల సంరక్షణ అధ్యయన బాధ్యతను బెంగళూరు ఐఐఎ్‌ససీకి, పరిశీలనా బాధ్యతను తిరుచ్చి ఎన్‌ఐటీకి అప్పగించారు. అదేవిధంగా నర్మదా, మహానది, పెరియార్‌ నదీ అధ్యయన, పరిశీలన బాధ్యతలను ప్రముఖ విద్యా సంస్థలకు అప్పగించారు. నదీ సంరక్షణ బాధ్యతలను చేపట్టేందుకు వీలుగా అధ్యయన సంస్థలతో కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. సమావేశం అనంతరం ఈ నదులను శుభ్రపరిచి, సంరక్షించే బాధ్యతలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకోనున్నది.

Updated Date - May 26 , 2024 | 08:28 AM