Share News

‘గాజులదిన్నె’కు గండం!

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:32 AM

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రమాదంలో పడింది. జగన్‌ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పటికే కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

‘గాజులదిన్నె’కు గండం!

గేట్లు పెట్టారు.. రోప్‌ కనెక్షన్లు మరిచారు

వరద పోటెత్తితే గేట్లు తెరిచే అవకాశమే లేదు

30 కోట్ల బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టరు

జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పొంచి ఉన్న ముప్పు

మరో ‘అన్నమయ్య డ్యాం’ కాకముందే స్పందించాలి

సాగునీటి నిపుణులు, రైతుల వినతులు

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రమాదంలో పడింది. జగన్‌ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగా ఇప్పటికే కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అక్కడో ప్రాజెక్టు ఉందనే అనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో గాజులదిన్నె జలాశయానికీ అలాంటి ముప్పే పొంచి ఉంది. ప్రాజెక్టు ఆధునీకరణ, మరమ్మతుల్లో భాగంగా కొత్త గేట్లు బిగించారు. అయితే వాటి నిర్వహణకు వీలుగా రోప్స్‌, లైనాప్‌ ప్లేట్లు వంటివి ఏర్పాటు చేయలేదు. డ్యాం ఎగువన వర్షాలు పడుతున్నాయి. వరద పోటెత్తితే గేట్లు ఎత్తే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పదని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు జగన్‌ ప్రభుత్వంలో రూ.30 కోట్లు బిల్లులు చెల్లించకపోవడంతో ఆరు నెలలు క్రితమే కాంట్రాక్టరు చేతులెత్తేశారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే గాజులదిన్నె కూడా అన్నమయ్య ప్రాజెక్టు తరహాలో ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లా గాజులదిన్నె (దామోదరం సంజీవయ్య సాగర్‌) ప్రాజెక్టు ఒకటి. కర్నూలు జిల్లా గోనేగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ, డోన్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో రబీ పంటలకు 24,372 ఎకరాలకు సాగునీరు, కర్నూలు నగరం, కృష్ణగిరి, డోన్‌ పట్టణాలతో పాటుగా 125 గ్రామాలకు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారానే అందుతోంది. బండగట్టు రక్షిత మంచినీటి పథకం ద్వారా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 80 గ్రామాలకు పైగా తాగునీరు అందించాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా కాలువ నుంచి 3 టీఎంసీల నీటిని కేటాయించారు. దీంతో జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు పెంచాలనే లక్ష్యంగా రూ.108 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ తర్వాత జగన్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సవరించి 5.5 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ రూ.37 కోట్లతో ఆనకట్ట బలోపేతం, ఎత్తు పెంచడం వంటి పనులు చేపట్టారు. మరో రూ.12కోట్లతో కొత్త గేట్ల ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ పనులను బీఎన్‌వీ కన్‌స్ట్రక్షన్‌, శ్రీశ్రీ విజ్ఞేశ్వర కన్‌స్ట్రక్షన్‌ సంస్థలు దక్కించుకోగా.. విజయవాడకు చెందిన కాంట్రాక్టరు కోటిరెడ్డి సబ్‌ కాంట్రాక్టు తీసుకుని 2022 ఏప్రిల్‌ 26న పనులు చేపట్టారు.

భారీ వరదొస్తే తిప్పలే

గాజులదిన్నె ప్రాజెక్టు ఆరు గేట్ల డిశ్చార్జ్‌ కెపాసిటీ (వరద విడుదల సామర్థ్యం) 80 వేల క్యూసెక్కులు. ఈ గేట్లకు దశాబ్దాలుగా మరమ్మతులు చేయకపోవడంతో తుప్పుపట్టాయి. నిర్వహణ కష్టంగా మారింది. కొత్త గేట్ల ఏర్పాటులో భాగంగా 2023 సెస్టెంబరులోనే ఫ్యాబ్రికేషన్‌ (తయారీ), ఎరక్షన్‌ (పాతవాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చడం) వంటి పనులు పూర్తి చేశారు. వాటిని కిందకు, పైకి ఎత్తేందుకు(లిఫ్ట్‌) వీలుగా రోప్‌ కనెక్షన్లు, లైనా్‌పప్లేట్స్‌ వంటి కీలకమైన పనులు చేయాల్సి ఉంది. చిన్న పనులే అయినా గేట్ల నిర్వహణలో ఇవే కీలకం. ఆనకట్ట బలోపేతం, గేట్ల ఏర్పాటు పనులకు దాదాపు రూ.30 కోట్ల మేర బిల్లుల చెల్లింపునకు జగన్‌ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేయలేనంటూ కాంట్రాక్టరు చేతులెత్తేశారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. రుతుపనాలు ఆశాజనకంగా ఉండటంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 77.7 మి.మీ. కాగా ఆదివారం (9వ తేదీ) నాటికే 97.9 మి.మీ. కురిసింది. 3శాతం అధిక వర్షపాతం నమోదైంది. జలాశయం ఎగువన పత్తికొండ మండలంలో 89.9 మి.మీ.కు గానూ 154.6 మి.మీ. (72ు అధికం), ఆలూరు ప్రాంతంలో 77.5 మి.మీ.కు గానూ 108.2 మి.మీ.(40ు అధికం), మద్దికెర మండలంలో 70.2 మి.మీ.కు గానూ 77.4 మిల్లీమీటర్లు (10ు అధికం) వర్షం పడింది. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అదే జరిగితే డ్యాంకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌ దాటి వరద పోటెత్తితే గేట్లు ఎత్తాల్సి వస్తుంది. కొత్తగేట్లకు రోప్స్‌, లైనాప్‌ ప్లేట్ల పనులు చేయకపోవడంతో ఆనకట్టకు గండి కొట్టకపోతే కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. కడప జిల్లాలో 2022 నవంబరులో అధిక వరద అన్నమయ్య ప్రాజెక్టుకు పోటెత్తడంతో ఒక గేటు రోప్‌ తెగిపోయి అడ్డంగా ఇరుక్కుపోవడంతో పైకి ఎత్తలేని పరిస్థితి. సామర్థ్యానికి మించి వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కొల్పోవడంతో పాటు పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి పరిస్థితులు రాకముందే గాజలదిన్నె ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు పూర్తిచేసి నిర్వహణకు అనుకూలంగా రోప్స్‌, లైనాప్‌ ప్లేట్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

తక్షణమే మరమ్మతులు చేపడతాం

గాజులదిన్నె ప్రాజెక్టుకు కొత్త గేట్లు ఏర్పాటు చేశాం. రోప్స్‌, లైనాప్‌ ప్లేట్లు ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. భారీ వరదలు వస్తే ఆనకట్టకు ప్రమాదం ఉన్న మాట నిజమే. కాంట్రాక్టరుపై ఒత్తిడి తెచ్చి తక్షణమే మిగిలిన పనులు చేయిస్తాం. ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.

- కబీర్‌బాషా, సీఈ, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, కర్నూలు

Updated Date - Jun 10 , 2024 | 03:32 AM