బుడమేరు గండి పూడ్చివేతకు ‘గేబియన్ బుట్టలు’
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:47 AM
బుడమేరు గట్టుకు పడిన భారీ గండిని భారత సైన్య సాంకేతిక పరిజ్ఞానంతో పూడ్చివేశారు. ఇందుకోసం ‘గేబియన్ బుట్టల’ను ఉపయోగించారు.
అక్కరకొచ్చిన ఆర్మీ సాంకేతికత
అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బుడమేరు గట్టుకు పడిన భారీ గండిని భారత సైన్య సాంకేతిక పరిజ్ఞానంతో పూడ్చివేశారు. ఇందుకోసం ‘గేబియన్ బుట్టల’ను ఉపయోగించారు. మొదటి రెండు గండ్లను.. జల వనరుల శాఖ సంప్రదాయ విధానంలో కొట్టుకుపోయిన కట్లపై భారీ రాళ్లు, మట్టి పోసి కట్టలు వేసి పూడ్చేసింది. కానీ మూడో గండి దాదాపు 100 మీటర్ల మేర ఉండడంతో దానిని పూడ్చేందుకు సైన్యం కూడా సాయం చేసింది. వరద నివారణ చర్యల్లో కీలకంగా పనిచేసే అనుభవం కలిగిన ఆర్మీ.. భారీ వరద తాకిడిని తట్టుకునేందుకు అడ్డుకట్టలు వేయడానికి గేబియన్ బుట్టలను వాడుతుంటుంది.
గేబియన్ బుట్టలంటే..!
ఇనుప చువ్వలతో పెద్ద బుట్టల్లా తయారు చేస్తారు వాటిని గండిపడ్డ ప్రాంతంలో పొందికగా ఉంచుతారు.. వాటిలో పెద్ద పెద్ద రాళ్లతో పాటు మట్టి కూడా వేస్తారు. ఈ బుట్టలను ఒకదాని పక్కన మరొకటి, ఒకదానిపైన ఇంకొకటి పేర్చుతారు.వాటిపై మళ్లీ రాళ్లు, మట్టి పోస్తారు. తద్వారా గండిపూడ్చడం తేలకని. గేబియన్ బుట్టలు బరువుగా ఉండడం వల్ల వరద తాకినా కదలవని ఆర్మీ అధికారులు వెల్లడించారు. సహజంగా వరద భారీగా ఉన్నప్పుడు ఎంత పెద్దరాళ్లను వేసినా తట్టుకోలేవు. అవి కదిలిపోతాయి. రాళ్లు కదిలితే.. దానిపై వేసిన మట్టి కొట్టుకుపోతుంది. ఇనుప చువ్వల బుట్టలో వేసిన పెద్దరాళ్లు వరదకు తట్టుకుంటాయి. రాళ్లు కదలకుండా ఇనుప చువ్వలు చుట్టూ ఫెన్సింగ్ తరహాలో రక్షణ ఇస్తాయి. గేబియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్మీ ఆధికారులు బుడమేరు గండి పూడ్చివేతలో వినియోగించడంతో.. రాష్ట్రానికి కొత్త సాంకేతిక విధానం పరిచయమైంది.