Share News

ఉగ్ర గోదారి!

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:10 AM

గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. అధికారుల అంచనాలకు కూడా అందని విధంగా నదిలో ప్రవాహం పెరుగుతోంది.

ఉగ్ర గోదారి!

అధికారుల అంచనాలకు అందని వరద

భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక జారీ

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీరు

వణుకుతున్న లంక గ్రామాల ప్రజలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. అధికారుల అంచనాలకు కూడా అందని విధంగా నదిలో ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇది మరింత పెరుగుతుందనే అంచనాతో అధికారులు ఉన్నారు. సాయంత్రం 5గంటలకు భద్రాచలం వద్ద 53.30 అడుగుల నీటిమట్టం ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 14 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి కోనసీమ జిల్లా మీదుగా సముద్రంలోకి 13,14,870 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద వరద పెరగడంతో పోలవరం ఎగువ భాగంలోని విలీన మండలాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే రాజమహేంద్రవరం లంకలు నీట మునిగాయి. గోదావరి పాయలు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోనూ లంకలను ముంచెత్తుతూ పరుగులు తీస్తున్నాయి. కాజ్‌వేల మీదకు వరద నీరు చేరి, లంక గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

సుమారు 10 రోజులుగా వరద కష్టాలు వీడటం లేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి వరద ఉధృతి మరింత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కేంద్ర జలసంఘం అంచనా ప్రకారం మరో మూడు రోజులు వరద ప్రవాహం కొనసాగి, తర్వాత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. వరద మరింత పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి వరద పెరగడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా 12 మండలాల పరిధిలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. జిల్లాలోని గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికితోడు శనివారం సాయంత్రం నుంచి వర్షపు జల్లులు కురుస్తుండడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం 24.027 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న 11,87,497 క్యూసెక్కుల నీటిని 48 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకువెళ్లే ప్రధాన మార్గంలోని కడెమ్మ వంతెనపై రెండడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడికాల్వకు 5,310 క్యూసెక్కుల జలాలు విడుదల చేసినట్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు పెద్దిరాజు తెలిపారు.

ఉధృతంగా శబరి ..

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి, శబరి, సీలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 42 అడుగులకు చేరింది. సీలేరు జల విద్యుత్‌ కేంద్రానికి చెందిన డొంకరాయి రిజర్వాయరు నుంచి నాలుగు గేట్ల ద్వారా 13,124 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో వరద గంటగంటకూ పెరుగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 30వ నెంబరు, 326వ నెంబరు జాతీయ రహదారులపై వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు. 525 గ్రామాలు ప్రభావితమయ్యాయని, మరో 230 గ్రామాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. 43,234 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 2,728 హెక్టార్ల లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. 21వేల మందిని 82 పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 03:10 AM