Share News

నిధులు లేక టీడీపీ పై నిందలా..?

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:11 AM

వైసీపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. నిధుల కొరత ఏర్పడడంతో పింఛన్‌దారులకు ఒకటో తారీఖున పింఛన్లు అందించలేకపోయింది.

నిధులు లేక టీడీపీ పై నిందలా..?
ఎంపీడీఓకు వినతి పత్రం అందజేస్తున్న వీరభద్రగౌడ్

పింఛన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం విఫలం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌

ఎంపీడీవోలకు వినతులు అందజేసిన టీడీపీ

‘‘వైసీపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. నిధుల కొరత ఏర్పడడంతో పింఛన్‌దారులకు ఒకటో తారీఖున పింఛన్లు అందించలేకపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిధులను వారి వ్యక్తిగత కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి ప్రభుత్వ సొమ్మును బుగ్గిపాలు చేశారు. ఇప్పటికైనా టీడీపీపై నిందలు వేయడం మాని, లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు అందించి చిత్తశుద్ధిని నిరూపించుకోండి’’ అంటూ తెలుగు దేశం పార్టీ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు మండల అభివృద్ధి అధికారులను కలిసి పింఛన్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వినతి పత్రాలు అందజేశారు.

ఎమ్మిగనూరు రూరల్‌ , ఏప్రిల్‌ 2: సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పింఛన్లను పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎంపీడీవో కొండన్న ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నెల రోజుల ముందే వలంటీర్లతో పింఛన్లను పంపిణీ చేయరాదని ఆదేశాలు జారీ చేసిందన్నారు. వారికి ప్రభుత్వం అందించిన సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు రూ.13వేల కోట్లు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా మార్చి 16-30వ తేదీల మధ్యలో సొంత కాంట్రాక్టర్లకు జగన్మోహన్‌రెడ్డి దోచిపెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండయ్యచౌదరి, ఖలీముల్లా రాందాసుగౌడు, తురేగల్‌ నజీర్‌, సుందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

ఆలూరు, ఏప్రిల్‌ 2: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆలూరు టీడీపీ ఆలూరు అభ్యర్థి వీరభద్రగౌడ్‌ కోరారు. ఈ మేరకు ఆలూరు ఎంపీడీవో నరేంద్ర కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి యథావిధిగా పింఛన్ల పంపిణీ కొనసాగించాలని కోరారు. ఆయన వెంట టీడీపీ నాయకులు గిరి మల్లేష్‌గౌడ్‌, టీడీపీ నాయకులు సాలి సాహెబ్‌ తదితరులు ఉన్నారు.

ఇళ్ల దగ్గరకు వెళ్లి పింఛన్లు ఇవ్వాలి

ఆస్పరి, ఏప్రిల్‌ 2: పింఛన్‌ లబ్ధిదారులకు యథావిధిగా ఇంటి దగ్గరికి వెళ్లి పింఛన్‌ సొమ్మును అందించాలని టీడీపీ మాజీ ఎంపీపీ కృష్ణ యాదవ్‌, సర్పంచ్‌ ఆంజనేయులు కోరారు. ఈ మేరకు స్థానిక ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం.. అదే సచివాలయ సిబ్బందితో ఇంటి దగ్గరకు వెళ్లి పింఛను సొమ్ము అందించడానికి సాధ్యపడదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం దుష్ప్రచారం మానుకోవాలి

కౌతాళం: పింఛన్ల పంపిణీ చేతకాని అధికార పార్టీ వైసీపీ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష పార్టీపై దుష్ప్రచారం మానుకోవాలని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌నాయుడు అన్నారు. ఈ మేరకు ఎంపీడీఓ రఘునాథ్‌గుప్తను కలిసి వినతి పత్రం అందజేశారు.

వైసీపీ కుట్ర బట్టబయలు ..

కోసిగి : ప్రతి నెలా 1వ తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేయాల్సిన పింఛన్‌ పంపిణీలో వైసీపీ కుట్ర బట్టబయలైందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, కోసిగి మండల టీడీపీ కన్వీనర్‌ జ్ఞానేష్‌, మాజీ జడ్పీటీసీ రామక్రిష్ణ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభావతిని, కోసిగి మేజర్‌ పంచాయతీ ఈవో తిరుమలేష్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

అవ్వా తాతలకు ఇంటికి వెళ్లి ఇవ్వాలి..

ఆదోని: అవ్వా తాతలకు పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇవ్వాలని టీడీపీ మండల అధ్యక్షుడు బసవరాజు కోరారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో శేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

తుగ్గలి : ప్రభుత్వ ఉద్యోగులే ఇళ్ల వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పింఛన్‌ అందించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకట్రాముడు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటపతి అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. టీడీపీ మండల కన్వీనర్‌ తిరుపాల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:11 AM