Share News

కాంగ్రెస్‌ ఖాతాల స్తంభన!

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:58 AM

లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది.

కాంగ్రెస్‌ ఖాతాల స్తంభన!

ఐటీ శాఖ ఆదేశాలు.. 2018-19లో

రూ.210 కోట్ల పన్ను చెల్లించలేదని చర్య

ట్రైబ్యునల్‌లో అప్పీల్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ

ఖాతాల్లో రూ.115 కోట్లు ఉంచాలి

ఆపై సొమ్మునే వాడాలని ట్రైబ్యునల్‌ ఆదేశం

విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా

కరెంటు బిల్లులు కట్టేందుకూ డబ్బుల్లేవు

ప్రజల విరాళాల్నీ స్తంభింపజేశారు: మాకెన్‌

ప్రజాస్వామ్యాన్ని కోర్టులే కాపాడాలి: ఖర్గే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది. అయితే, ఐటీ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఈ చర్యను కొన్ని మినహాయింపులతో నిలిపి వేస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. కాంగ్రెస్‌ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ మీడియాతో మాట్లాడుతూ, గత లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.210 కోట్ల ఆదాయపు పన్ను కట్టాలంటూ తమ పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిందని, వీటిలో యువజన కాంగ్రెస్‌ ఖాతా కూడా ఉన్నదని తెలిపారు. సదరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొంత ఆలస్యంగా ఐటీ రిటర్నులను దాఖలు చేశామని, ఈలోపే ఈ చర్య తీసుకున్నారన్నారు. ఐటీ ఆదేశాలు బుధవారం జారీ అయ్యాయని చెప్పారు. అయితే, ఐటీ శాఖ స్తంభింపజేసిన కాంగ్రెస్‌ ఖాతాల సంఖ్య తొమ్మిదని తర్వాత వెల్లడైంది. కాగా, ఐటీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేత వివేక్‌ టంకా ఐటీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు. తమ ఖాతాలను స్తంభనను కొనసాగిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము పాల్గొనే పరిస్థితి ఉండబోదని ట్రిబ్యునల్‌కు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్‌.. బ్యాంకు ఖాతాల్లో కనీసం రూ.115 కోట్ల మొత్తం ఉంచాలని, ఆ పైనున్న సొమ్మును మాత్రమే వినియోగించుకోవాలని, బుధవారం తదుపరి విచారణ జరుపుతామని తెలిపింది. దీనిపై మాకెన్‌ స్పందిస్తూ.. ట్రిబ్యునల్‌ రూ.115 కోట్ల వరకూ నిధులను స్తంభింపజేసిందని, అయితే, ప్రస్తుతం తమ కరెంటు ఖాతాల్లో అంత మొత్తం లేదని, అంటే తమ ఖాతాల స్తంభన కొనసాగుతున్నట్లేనని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ వేతనాల్లోంచి పార్టీకి ఇచ్చిన రూ.14.4 లక్షలతోపాటు ప్రజల నుంచి తాము సేకరించిన విరాళాలను కూడా స్తంభింపజేశారని తెలిపారు. విద్యుత్‌ బిల్లులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా తమ వద్ద డబ్బు లేదని, తాము జారీ చేసిన చెక్కులను బ్యాంకులు తిరస్కరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఖాతాలు స్తంభింపచేయడమంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయడమేనన్నారు.

నియంతృత్వం ముందు ఎన్నటికీ మోకరిల్లం: రాహుల్‌ గాంధీ

తమ బ్యాంకు ఖాతాల స్తంభనను ఖర్గే తీవ్రంగా ఖండించారు. అధికారదాహంతో ఉన్న కేంద్రప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీపై చేపట్టిన ఈ చర్య ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడి అని పేర్కొన్నారు. ‘రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ సేకరించిన డబ్బులు ఆ పార్టీ వద్దే ఉంటాయి కానీ, ప్రజల నుంచి మేం సేకరించిన విరాళాల్ని మాత్రం స్తంభింపజేస్తారు. అందుకనే, మోదీ మళ్లీ గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని నేను ఇప్పటికే హెచ్చరించా. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, బహుళ పార్టీ వ్యవస్థను కాపాడమని న్యాయవ్యవస్థను కోరుతున్నా’ అని ఖర్గే విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ బలం డబ్బుల్లో లేదని, ప్రజల్లో ఉందని, నియంతృత్వం ముందు ఎన్నటికీ మోకరిల్లబోమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రాజకీయ సమతుల్యతను కాపాడటానికి ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవటంతో.. ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకొని తమ ఖాతాలను స్తంభింపజేసిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు.

Updated Date - Feb 17 , 2024 | 03:58 AM