Share News

ఉచిత ఇసుక.. సులభమిక! బుకింగ్‌కు ప్రత్యేకంగా యాప్‌

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:18 AM

ఉచిత ఇసుకను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా యాప్‌ తీసుకురావడంతోపాటు..

ఉచిత ఇసుక.. సులభమిక! బుకింగ్‌కు ప్రత్యేకంగా యాప్‌

రవాణాకు ప్రభుత్వ వాహనాలు.. రాష్ట్ర స్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌

జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కేంద్రాలు

ఫిర్యాదుల కోసం 1800-599-4599

టోల్‌ ఫ్రీ నెంబరు అందుబాటులోకి.. సమీక్షలో సీఎం నిర్ణయాలు

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుకను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా యాప్‌ తీసుకురావడంతోపాటు.. ఇసుక రవాణాకు ప్రభుత్వ వాహనాలనే సిద్ధం చేయనుంది. అదేవిధంగా అవకతవకలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీనెంబరును కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పథకంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఇసుకను మరింత సులభంగా వినియోగదారులకు చేరువ చేయడంపై చర్చించారు.. వినియోగ దారులు ఇసుకను సులభంగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో వినియోగదారులు ఆన్‌లైన్‌లో యాప్‌లో గానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ ఇసుక బుక్‌ చేసుకునే వెలుసుబాటు ఉంటుందన్నారు. బుక్‌ చేసుకున్న తర్వాత ఏ తేదీన వారికి ఇసుక చేరుతుందో కూడా పేర్కొనాలని సూచించారు. ఇసుక సరఫరాలో మధ్యవర్తులకు చోటివ్వకూడదని అధికారులను ఆదేశించారు. థర్డ్‌పార్టీ ఏజెన్సీ ద్వారా బయటకు వెళ్లే ఇసుకపై నిర్ణీత కాలవ్యవఽధిలో ఆడిట్‌ జరపాలని సూచించారు. విజిలెన్స్‌ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలన్నారు. అలాగే, ఇసుకను చేరవేయడానికి ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లో గాని, వినియోగదారులు తమ సొంత వాహనాల్లో గాని ఇసుకను రవాణా చేసుకునే ఏర్పాటు చేయాలన్నారు.. రవాణా చార్జీలను వినియోగదారులే నేరుగా వాహనాదారులకు చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. దీనివల్ల రవాణా చార్జీలు స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీస్థాయిలో ఇసుక బుకింగ్‌ చేసుకోవడానికి ప్రత్యేక బుకింగ్‌ విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

మరిన్ని నిర్ణయాలు

భారీ స్థాయిలో ఇసుక కోరుకునే వినియోగదారులు జీఎస్టీ సర్టిఫికెట్‌, అంత భారీమొత్తంలో ఇసుకతో ఏం పని చేస్తారు? ఎంత ఇసుక అవసరం? ప్రాజెక్టు సైట్‌ వివరాలు ఆన్‌లైన్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వాధికారి ఆ సైట్‌ను సందర్శించి తన అభిప్రాయాలను కూడా ఆన్‌లైన్‌లో వెల్లడిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే ఇసుక సరఫరా అవుతుంది. తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ వ్యయం, పన్నులు, సుంకాలు ఇతర చెల్లింపులను ఆన్‌లైన్‌లో చేయాలి.

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ప్రతి రీచ్‌లో థర్డ్‌ పార్టీ ఆడిట్‌ కమిటీలను నియమిస్తారు. రోజుకి ఒక రీచ్‌ నుంచి రవాణా చేయదగిన ఇసుక పరిమాణాన్ని ముందుగా నిర్ణయిస్తారు. మొదట బుక్‌ చేసుకున్న వారికి మొదటే ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. సీసీటీవీ కెమెరాల ద్వారా దీన్ని పర్యవేక్షించాలి.

ఇసుక రవాణా చేసే వాహనాలపై ’ఇసుక ఉచిత రవాణా వాహనం’ అని రాయాల్సి ఉంటుంది. రియల్‌ టైమ్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థతో ఆ వాహనాలను అనుసంధానం చేయాలి. జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీలను బలోపేతం చేయాలి.

ఇసుక తవ్వకాలు, రవాణాను పర్యవేక్షించేందుకు గనుల శాఖ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తారు. రియల్‌ టైమ్‌లో ఇసుక రవాణాను పర్యవేక్షించేందుకు, వినియోగదారులకు, వాహనదారులకు మధ్య సమన్వయం ఉండేలా ప్రతి జిల్లాలో ఇసుక రవాణా పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ఉచిత ఇసుక పథకంపై ఏవైనా ఫిర్యాదులుంటే ప్రజలు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-599-4599కి కాల్‌ చేసి చెప్పవచ్చు. వినియోగదారుల నుంచి 24 గంటల పాటు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ పథకంపై ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకుంటూ సేవలు మెరుగుపరుస్తారు.

Updated Date - Aug 15 , 2024 | 06:54 AM