అన్నదాతకు అన్యాయం..!
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:28 PM
వైసీపీ ప్రభుత్వం కరువు రైతుకు తీవ్ర అన్యాయం చేసింది. గతేడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం వెంటాడింది. వాన జాడలేక పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. పశుగ్రాసం కూడా దక్కలేదు. ఆ ప్రభావం రబీపై కూడా పడింది. మండే ఎండలతో భూగర్భ జలమట్టం పడిపోయింది.

రబీలో జిల్లా అంతటా దుర్భిక్షం..!
వాస్తవ పరిస్థితులను దాచిన వైసీపీ ప్రభుత్వం
పప్పుశనగ పంటకు మాత్రమే నష్టమంటూ నివేదిక
రొద్దం ఒక్కటే కరువు మండలమట..!
31 మండలాలకు మొండిచేయి
రేపు కేంద్ర కరువు బృందం రాక
రబీ ముగిశాక పంట నష్టం పరిశీలనపై విమర్శలు
పుట్టపర్తి, జూన17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం కరువు రైతుకు తీవ్ర అన్యాయం చేసింది. గతేడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం వెంటాడింది. వాన జాడలేక పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. పశుగ్రాసం కూడా దక్కలేదు. ఆ ప్రభావం రబీపై కూడా పడింది. మండే ఎండలతో భూగర్భ జలమట్టం పడిపోయింది. బోరుబావులు ఉన్నఫలంగా ఎండిపోయాయి. పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు పడిన అవస్థలు అన్నీ.. ఇన్నీ కావు. కొంతమంది రైతులు చేసేదిలేక పంటలను వదిలేసుకుని, సర్వం నష్టపోయారు. ఖరీఫ్, రబీ నష్టాలతో కోలుకోలేని స్థితిలో ఉన్న అన్నదాతను ఆదుకోవాల్సిన అప్పటి వైసీపీ ప్రభుత్వం అన్యాయమే చేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే ముందు హడావుడిగా కరువు ప్రాంతాల జాబితాను ప్రకటించింది. అందులో జిల్లాలో వేరుశనగ పంటకు మాత్రమే నష్టం వాటిల్లిందని పేర్కొంది. రొద్దం మండలాన్ని మాత్రమే తీవ్ర కరువు మండలంగా ప్రకటించి, మిగతా 31 మండలాల రైతులకు అన్యాయం చేశారు. ఈ నేపథ్యంలో రబీ పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర కరువు బృందం ఈనెల 19న జిల్లాకు రానుంది. రబీ పంట ముగిసి రెండు నెలలైందనీ, ఎప్పుడు ఏం పరిశీలిస్తారని అన్నదాతలు వాపోతున్నారు. కేంద్ర కరువు బృందం పర్యటనతోనైనా న్యాయం చేకూరుతుందా అని రైతులు ఆశగా చూస్తున్నారు.
రైతు ప్రభుత్వమంటే ఇదేనా?
వ్యవసాయమే జిల్లా ప్రజలకు ప్రధాన జీవనాధారం. గత ఖరీ్‌ఫలో వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. రబీలో కూడా ఈశాన్య రుతుపవనాలు బలహీన పడడంతో వాన జాడ కరువైంది. దీంతో భూగర్భ జలమట్టం పడిపోయి, పంటలు ఎండిపోయి రైతన్నలకు అప్పులే మిగిలాయి. 2023-24లో రబీ సీజనలో జిల్లా అతంటా కరువుఛాయలు అలుముకున్నా వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి ఒక్క మండలాన్నే కరువు జాబితాలో చేర్చారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకనే వైసీపీ ప్రభుత్వం ప్రకటించి, చేతులు దులుపుకుంది. వైసీపీ ప్రభుత్వం హడావుడి తప్పులకు రబీలో సాగులో ఒక్క మండలమే నష్టపోయిందంటూ ప్రకటనతో రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. గతేడాది ఖరీ్‌ఫలో ఏడు తీవ్ర, 14 మధ్యస్థ కరువు మండలాలను ప్రకటించి, 11 మండలాలకు మొండిచేయి చూపారు. రబీలో రొద్దం మండలాన్ని మాత్రమే కరువు జాబితాలో చేర్చారు. తామేం పాపం చేశామంటూ మిగిలిన 31 మండలాల రైతులు వాపోతున్నారు. పంట సాగు విస్తీర్ణం, దిగుబడి, వర్షపాతం నమోదు భూమిలో తేమశాతం భూగర్భజలమట్టం తదితర అంశాలపై కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కరువు మండలాలను ఎంపిక చేస్తారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వైసీపీ పాలకులు.. వారికే అన్యాయం చేశారు. అప్పట్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో వైసీపీ జిల్లా ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి రబీలో పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా యంత్రాంగం మాత్రం క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులను పరిశీలించకుండానే గత ప్రభుత్వం చెప్పినట్లు కంటితుడుపుగా నివేదికలు సిద్ధం చేసి, పంపింది. కరువు ప్రాంతాల జాబితాలో చోటు లభిస్తే ఆయా మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్, పంటనష్ట పరిహారం, తాగునీటికి నిధులు, ఉపాధి కల్పన తదితర కరువు సహాయక చర్యలకు అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మార్చి ఆఖరుకు రబీ ముగిసింది. అప్పట్లో జిల్లావ్యాప్తంగా ఎండిపోయిన పంట పొలాలు కనిపించేవి. రబీ సీజన ముగిసి రెండు నెలలు దాటింది. మళ్లీ ఖరీఫ్ సీజన ప్రారంభమై జిల్లా అంతటా వర్షం కురుస్తోంది. ఇప్పుడు కేంద్ర కరువు బృందం పర్యటన ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తోందనన్న ఆందోళన నెలకొంది.
పుప్పుశనగ ఒక్కటేనట..!
జిల్లాలోని 32 మండలాల్లో ప్రధానంగా వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. నీటి వనరులున్న రైతులు రబీలో పుప్పుశనగ, వరి, వేరుశనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటలు 28192 హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో పప్పుశనగ పంటను రొద్దం, పరిగి, తాడిమర్రి, పెనుకొండ మండలాల్లో సాగు చేశారు. రొద్దం మండలంలోనే అధికంగా 876 హెక్టార్లలో పంట వేశారు. ఈనేపథ్యంలోనే మార్చిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం రొద్దం మండలాన్ని మాత్రమే కరువు ప్రాంతంగా ప్రకటించింది. రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలమట్టం తగ్గి, పంటలు ఎండిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రొద్దం మండలంలో మాత్రమే పప్పుశనగ పంటకు నష్టం వాటిల్లినట్లు యంత్రాగం.. ప్రభుత్వానికి హడావుడిగా ప్రతిపాదనలు పంపింది. రొద్దం మండలంలో 503 మంది రైతులు 656.92 హెక్టార్లలో పప్పుశనగ పంట సాగు చేసి, నష్టపోయారు. రూ.65.60 లక్షలు పరిహారం అందించాలని అప్పట్లో అధికారులు.. ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
పంటే లేదు.. ఏం పరిశీలిస్తారు..?
రబీ సీజన ముగిసి రెండు నెలలు దాటింది. కేంద్ర కురువు బృందం ఇప్పుడు రబీ పంట నష్టాన్ని పరిశీలించేందుకు వస్తోంది. బుధవారం జిల్లాకు రానున్నట్లు యంత్రాంగం చెబుతోంది. పంటలే లేనపుడు ఏం పరిశీలిస్తారన్న విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. గత ఖరీ్‌ఫలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లా అంతటా పంటలు ఎండిపోయాయి. కనీసం పశుగ్రాసం కూడా దక్కలేదు. గతేడాది డిసెంబరులో పర్యటించిన కేంద్ర కురువు బృందం కేవలం 73,566 హెక్టార్లలో మాత్రమే వేరుశనగ, మొక్కజొన్న పంటలు నష్టపోయినట్లు నివేదిక ఇచ్చింది. ఆ మేరకే కంటితుడుపుగా పరిహారం ఇచ్చారు. జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. రబీ పంట నష్ట పరిహారం విషయంలో మరోసారి జిల్లా రైతును మోసం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రేపు కేంద్ర కరువు బృందం రాక
2023-24 రబీ సీజనలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఉమ్మడి జిల్లాలో కేంద్ర కరువు బృందం ఈనెల 19న జిల్లాకు రానుంది. రొద్దం మండలం ఆర్ కొట్టాలలో పర్యటించనున్నారు. ఉమ్మడి అనంత జిల్లాలోని రెవెన్యూ భవనలో జిల్లాలో కరువు పరిస్థితులపై ఛాయాచిత్రాలతో జిల్లా అధికారులు.. కరువు బృందానికి వివరిస్తారు. మధ్యాహ్నం ఆర్ కొట్టాల, చెరుకూరు పుప్పుశనగ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పుప్పుశనగ పంట లేకపోవడంతో జిల్లా యంత్రాగం.. ప్రభుత్వానికి పంపిన నివేదికను అధ్యయనం చేసి, రైతుల ద్వారా కరువు పరిస్థితిని తెలుసుకోనుంది. అధికార యంత్రాంగం పంపిన నివేదికతో రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూరుతుందోనన్న ఆందోళన నెలకొంది. జిల్లా అంతటినీ కరువు ప్రాంతంగా ప్రకటించి, ఆదుకోవాలని రైతాంగం కోరుకుంటోంది.