మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత
ABN , Publish Date - Nov 06 , 2024 | 04:58 AM
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు... రెడ్డి సత్యం మాస్టారుగా సుపరిచితులైన రెడ్డి సత్యనారాయణ(99) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
సత్యం మాస్టారు నిరాడంబరతకు నిలువుటద్దం
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా
ఆర్టీసీ బస్సు, రైలులోనే ప్రయాణం
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం
అమరావతి, చీడికాడ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు... రెడ్డి సత్యం మాస్టారుగా సుపరిచితులైన రెడ్డి సత్యనారాయణ(99) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడ గ్రామానికి చెందిన రెడ్డి సత్యనారాయణ ఎస్‌ఎ్‌సఎల్‌సీ చదువుకుని, 1952 నుంచి 1983 వరకూ ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 1999 వరకూ జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో(వరుసగా ఐదుసార్లు) గెలుపొంది రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో మం త్రిగా పనిచేశారు. రాష్ట్ర హస్త కళల బోర్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన సతీమణి నారాయణమ్మ గతంలోనే చనిపోయా రు. సత్యనారాయణ మృతి పట్ల టీడీ పీ నాయకులు సంతాపం వెలిబుచ్చా రు. ఆయన అంత్యక్రియలు బుధవా రం స్వగ్రామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, రెడ్డి సత్యనారాయణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కలచివేసింది: చంద్రబాబు
రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. ‘ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన సత్యనారాయణ... నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన సత్యనారాయణ మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటనలో.. ‘మంత్రిగా ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించిన సత్యనారాయణ మృతితో నిరాడంబర ప్రజాసేవకుడిని టీడీపీ కోల్పోయింది’ అని పేర్కొన్నారు.