Share News

మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్టు

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:24 AM

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఎస్‌డీఆర్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్‌ చేసిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు

మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్టు

జీఎస్టీ ఎగవేశారని ఎస్డీఆర్‌ఐ ఫిర్యాదు

కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు

గుంటూరులో అరెస్టుచేసి బెజవాడ తరలింపు

పొద్దుపోయేదాకా ఆచూకీ చెప్పకపోవడంతో

సీపీ ఆఫీసు వద్ద టీడీపీ శ్రేణుల నిరసన

అర్ధరాత్రి వేళ న్యాయాధికారి ఎదుట హాజరు

గుంటూరులో అరెస్టుచేసి బెజవాడ తరలింపు

విజయవాడ, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఎస్‌డీఆర్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్‌ చేసిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసునమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున శరత్‌ను అరెస్టుచేసి విజయవాడ తీసుకొచ్చారు. అయితే ఆయన్ను ఎక్కడ ఉంచిందీ ఆచూకీ చెప్పలేదు. దీంతో ఆందోళన చెందిన పుల్లారావు, టీడీపీ నేతలు పట్టాభి, పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, కార్యకర్తలు పోలీసుకమిషనర్‌ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆందోళన చేశారు. కార్యాలయం లోపలకు వెళ్లడానికి యత్నించగా.. పోలీసులు గేటు మూసివేశారు. దీంతో వారు అక్కడే బైఠాయించారు. శరత్‌ ఆచూకీ తెలపాలని నినాదాలు చేశారు. గంట తర్వాత రూరల్‌ డీసీపీ కంచి శ్రీనివాసరావు వచ్చి పుల్లారావుతోపాటు ముగ్గురు నేతలను లోపలకు తీసుకెళ్లి మాట్లాడారు. మరో గంటలో శరత్‌ను న్యాయాధికారి ఎదుట హాజరుపరుస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. తర్వాత శరత్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక న్యాయాధికారి ఇంట్లో ఆయన ఎదుట హాజరుపరిచారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే..

ఎఫ్‌ఐఆర్‌లో అవెక్సా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు కుర్రా జోగేశ్వరరావు, బొగ్గవరపు నాగమణి, మాజీ డైరెక్టర్లు పుల్లారావు కుమారుడు శరత్‌, బొగ్గవరపు అంకమ్మరావు, బొగ్గవరపు మార్కండేయులు, పత్సమట్ల భీమరాజు, ప్రత్తిపాటి టీనె వెంకాయమ్మలను నిందితులుగా చేర్చారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 453, 411, 477(ఎ), 120(బీ) రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. అవెక్సా కార్పొరేషన్‌ ఇంతకుముందు శివస్వాతి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఉండేది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సాగర్‌ సొసైటీ రెండో నంబర్‌ రోడ్‌లో 8.2.3269/ఎస్‌/41లో ప్లాట్‌ నంబర్‌ 41లో ఉంది. దీనికి బ్రాంచ్‌ కార్యాలయాలు విజయనగరం, నెల్లూరులో ఉన్నాయి. ఈ సంస్థ కాంట్రాక్టు పనులను నిర్వహిస్తోంది. జీఎస్టీఐఎన్‌ 37ఏఏఐసీఎస్‌9943ఎ్‌స2జడ్‌యు కింద రిజిస్టర్‌ అయింది. ‘ఈ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఐటీసీ (ఇన్‌ఫుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌) సక్రమంగా చెల్లించడం లేదు. హైదరాబాద్‌ డీజీజీఐ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ ఇంటెలిజెన్స్‌) ఈ సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ డిమాండ్‌ నోటీసులు ఇచ్చారు. అవెక్సా సంస్థ 2017 జూలై నుంచి 2022 మార్చి వరకు ఎలాంటి రశీదులు లేకుండా తప్పుడు మార్గంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చేసింది. నాడు డైరెక్టర్‌గా ఉన్న కుర్రా జోగేశ్వరరావు జీఎస్టీ రిటర్న్స్‌ 38లో తప్పుడు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లోని డీజీజీఐ అధికారుల ముందు విచారణకు ఈ సంస్థ ప్రతినిధులు హాజరుకాలేదు. ఐటీసీని ఈ సంస్థ చాలా తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకుంది. జీఎస్టీ చట్టాన్ని సంస్థ ముఖ్య ప్రతినిధులు మరో విధంగా ఉపయోగించుకున్నారు. ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగించేలా ఆర్థిక అవకతవకలు చేశారు. దీనిపై డీఆర్‌ఐ అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం’ అని మాచవరం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై కమిషనర్‌ రాత్రికి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అవెక్సా సంస్థ 2017-22 పరిధిలో సీఆర్‌డీఏ పరిధిలో రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకుంది. ఎలాంటి రోడ్లూ వేయకుండానే బినామీ పేర్లతో ఢిల్లీలో మెటీరియల్‌ కొనుగోలు చేసినట్లుగా బోగస్‌ బిల్లులు సృష్టించింది. దీనిని డీజీజీఐ గుర్తించి రాష్ట్ర డీఆర్‌ఐకి నివేదిక పంపింది. దీనిపై ఆ విభాగం ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఐటీసీని పొందేందుకు అవెక్సా మారుమూల గ్రామాల్లో బ్యాంకు ఖాతాలు తెరిచి క్రెడిట్‌ పొందింది’ అని అందులో తెలిపారు.

ఏం జరిగినా సీఎందే బాధ్యత: పుల్లారావు

అంతకుముందు టీడీపీ కార్యాలయంలో పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ కన్నీరుపెట్టుకున్నారు. తన కుమారుడికి ఏం జరిగినా సీఎందే బాధ్యతని చెప్పారు. శరత్‌ ప్రాణాలకు హాని కలుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా కుమారుడిని తీసుకెళ్లి 14 గంటలు అవుతున్నా ఆచూకీ లేదు. అతడేమైనా హత్యలు చేశాడా.. అత్యాచారాలు చేశాడా? ఆ కంపెనీలో శరత్‌కు ప్రమేయం లేకపోయినా ప్రఽథమ ముద్దాయిగా పెట్టారు. రాజకీయ కక్ష కారణంగానే ఆచూకీ తెలియజేయడం లేదు. నాకు చంద్రబాబు చిలకలూరిపేట టికెట్‌ ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఈ కేసు నమోదు చేశారు. డీఆర్‌ఐ విభాగం సీఎం చెప్పుచేతల్లో ఉంటుంది. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే జగన్‌ లక్ష్యం. ఇటువంటి అక్రమ కేసులను ఆపాలి. నా కుమారుడిని బేషరతుగా విడుదల చేయాలి’ అని కోరారు.

Updated Date - Mar 01 , 2024 | 03:24 AM