Share News

నా కాళ్లు పట్టుకుని డీసీసీ అధ్యక్షుడయ్యావ్‌!

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:00 AM

‘‘నువ్వు డీసీసీ అధ్యక్షుడయ్యేందుకు రెండుసార్లు నా కాళ్లు పట్టుకున్నావ్‌! మరిచిపోయావా? నువ్వు నా కాళ్లు పట్టుకున్నావని నేను కాణిపాకంలోగానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. పట్టుకోలేదని నువ్వు ప్రమాణానికి సిద్ధమా?’’ అని వైసీపీ నాయకుడు, మంత్రి

నా కాళ్లు పట్టుకుని డీసీసీ అధ్యక్షుడయ్యావ్‌!

మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్‌ వ్యాఖ్యలు

అధికార మదంతో ఉన్నారని ఆగ్రహం

చంద్రబాబు అభివృద్ధి కూటమిని ఎన్నుకోవాలని పిలుపు

పీలేరు, ఏప్రిల్‌ 18: ‘‘నువ్వు డీసీసీ అధ్యక్షుడయ్యేందుకు రెండుసార్లు నా కాళ్లు పట్టుకున్నావ్‌! మరిచిపోయావా? నువ్వు నా కాళ్లు పట్టుకున్నావని నేను కాణిపాకంలోగానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. పట్టుకోలేదని నువ్వు ప్రమాణానికి సిద్ధమా?’’ అని వైసీపీ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గరువారం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నానని మంత్రి పెద్దిరెడ్డి పదేపదే విమర్శలు చేస్తున్నారు. పదవుల కోసం ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టే మనస్తత్వం నాది కాదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నా. ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీసీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అప్పటి వాయల్పాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నేను ఓ రోజు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బసచేశా. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. డీసీసీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తూ నా కాళ్లు పట్టుకున్నారు. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపు ఆయన ఆ మరుసటి ఉదయం 6 గంటలకల్లా అతిథి గృహానికి మళ్లీ వచ్చారు. ‘రాత్రి మద్యం మత్తులో కాళ్లు పట్టుకున్నానని అనుకుంటావేమో కిరణ్‌, అందుకని మళ్లీ వచ్చా. నీ కాళ్లు పట్టుకుంటా నాకు మద్దుతు ఇవ్వు’ అంటూ పెద్దిరెడ్డి మరోసారి కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటనను బహిర్గతం చేయడం సంస్కారం కాదని ఇంతకాలం ఓపిక పట్టా. ఎవరి నైజం ఏమిటో ప్రజలకు తెలియజేసేందుకు ఇష్టం లేకపోయినా చెబుతున్నా. అధికార మదంతో ఆయన పదేపదే నాపై విమర్శలు చేస్తుంటే తట్టుకోలేక బహిర్గతం చేశా’’ అని అన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 04:00 AM