Share News

అభివృద్ధి ఆంధ్రా కోసం... ఓటెత్తండి!

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:11 AM

వికసిత భారత్‌, అభివృద్ధి ఆంధ్ర కావాలంటే టీడీపీ - జనసేన - బీజేపీ కూటమినే గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

అభివృద్ధి ఆంధ్రా కోసం... ఓటెత్తండి!

ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

శనివారం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. వెంటనే ఏపీకి వచ్చాను. ఈ రోజు కోటప్పకొండలోని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ఆశీర్వాదం లభించింది. ఈ ముగ్గురు దేవుళ్ల ఆశీర్వాదంతో మూడోసారి అధికారంలోకి వస్తాం. దేశాభివృద్ధి కోసం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ‘అభివృద్ధి ఏపీ’ని సాధిస్తాం.

- ప్రధాని మోదీ

అవినీతి సర్కారును అంతం చేయండి

ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది

అవినీతి చేయడంలోనే మంత్రుల పోటీ

కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే సర్కారే

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో ప్రగతి పరుగులు

వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఏపీ మా లక్ష్యం

రాష్ట్రం కోసం చంద్రబాబు, పవన్‌ కృషి

కూటమి అభ్యర్థులనే గెలిపించండి

రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

(బొప్పూడి సభాప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)

వికసిత భారత్‌, అభివృద్ధి ఆంధ్ర కావాలంటే టీడీపీ - జనసేన - బీజేపీ కూటమినే గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీయే సర్కారు ఏర్పడాలని... రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో కూటమి ఎంపీలను పార్లమెంటుకు పంపించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి సర్కారును అంతం చేయాలన్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆవిర్భావం తర్వాత, సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడిన మరుసటి రోజునే... ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘భారత్‌ మాతాకీ.. జై’ అంటూ ప్రసంగం మొదలు పెట్టిన మోదీ.. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో అభివాదం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వస్తున్నాయని, ఎన్డీయేకు 400 సీట్లు దాటేలా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, వేయించి గెలిపించాలని మూడు పార్టీల కార్యకర్తలను కోరారు. ఎన్డీయే కూటమి ప్రాంతీయ ఆకాంక్షలతోపాటు జాతీయ భావాలు కలుపుకొంటూ అడుగులు వేస్తుందని తెలిపారు. భాగస్వాములు చేరేకొద్దీ కూటమి బలం పుంజుకుంటోందన్నారు.

రాష్ట్రంలో అవినీతి సర్కార్‌...

కేంద్రంలో మూడోసారి ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేయాలని... రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని పెకలించాలని ఆంధ్ర ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా సంకల్పం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ‘‘వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పేదల సంక్షేమం, యువతకు ఉపాధి, మహిళలకు కొత్త అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పోర్టులతోపాటు బ్లూ ఎకానమీ విస్తరణ చేయాల్సి ఉంది. అవన్నీ జరగాలంటే ఏపీ అసెంబ్లీ, ఢిల్లీ పార్లమెంటులో ఎన్డీయే సభ్యులు ఉండాలి. అప్పుడే మీరు అభివృద్ధి భారత్‌, అభివృద్ధి ఆంధ్ర సాకారానికి మద్దతిచ్చినట్లు’’ అని తెలిపారు. రాష్ట్రంలో జగన్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటే అని మోదీ పేర్కొన్నారు. ‘‘ఒకే కుటుంబం రెండు పార్టీలను నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై కోపంగా ఉన్న ప్రజలను కాంగ్రె్‌సవైపు మళ్లించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. మీరు పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చవద్దు. ఎన్డీయే కూటమి అభ్యర్థులకే ఓటు వేయండి, వేయించండి’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధికోసం ఆ ఇద్దరి కృషి...

చంద్రబాబు, పవన్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఏపీ కోసం డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు రావాలి. ఎన్డీయే ప్రభుత్వం పేదలకు సేవ చేస్తుంది. జనాభాలో 30కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తెచ్చింది’’ అని మోదీ పేర్కొన్నారు. ఏపీలోని పేదలకు ప్రధాని ఆవాస్‌ యోజన కింద పది లక్షల ఇళ్లు ఇచ్చామని, పల్నాడు ప్రాంతానికి ఐదు వేల ఇళ్లు వచ్చాయని మోదీ తెలిపారు. తాగడానికి పేదలకు శుభ్రమైన నీరిచ్చే జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా ఏపీలో కోటి కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు, ఆయుష్మాన్‌ భారత్‌ అనే బృహత్తర కార్యక్రమం కింద కోటి మందికి వైద్య భరోసా కల్పించామన్నారు. పల్నాడు ప్రాంతంలోని ఐదు లక్షల మందికి కేంద్రం ఉచిత రేషన్‌ ఇస్తోందని తెలిపారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఏపీలో రైతులకు రూ.700కోట్లు ఇచ్చామని, ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండాలన్నారు. ‘‘ఎన్డీయేకు చెందిన ప్రతి ఎంపీ మీ కోసమే పని చేస్తారు. ఇది మోదీ గ్యారెంటీ’’ అంటూ ప్రధాన మంత్రి మాటిచ్చారు.

ఉన్నత విద్యా కేంద్రంగా ఏపీ

రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాలని, యువతలో నైపుణ్యాన్ని వెలికి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ తెలిపారు. అందులో భాగంగానే తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌... విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ... కర్నూలులో ట్రిపుల్‌ ఐటీ, మంగళగిరిలో ఎయిమ్స్‌, విజయవాడలో నేషనల్‌ ఐఐడీ, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ, విజయనగరంలో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ వంటి కీలక విద్యా, వైద్య సంస్థలను ఏపీకి ఇచ్చాం’’ అని ప్రధాని తెలిపారు.

వైరుధ్యాల ‘విపక్ష కూటమి’

‘ఎన్డీయే కూటమి భాగస్వాములందరినీ కలుపుకొని వెళుతుంది. పరస్పర విశ్వాసాలను గౌరవిస్తూ ముందుకెళుతుంది. కానీ... మన ముందుకు వచ్చిన ఇండియా కూటమిలో అన్నీ వైరుధ్యాలే. ఒకరినొకరు తిట్టుకొంటూ యూజ్‌ అండ్‌ త్రో విధానం అవలంబిస్తోంది’’ అని పధ్రాని మోదీ విమర్శించారు. ‘‘కేరళలో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ తిట్టుకుంటాయి. బెంగాల్‌లో టీఎంసీ, లెఫ్ట్‌ దూషించుకుంటాయి. పంజాబ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ దుమ్మెత్తి పోసుకుంటాయి. దేశం కోసం ఎటువంటి దూరదృష్టి, ముందుచూపులేని వాళ్లు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళతారో ఆలోచించాలి’’ అని ప్రజలను కోరారు. ‘ఇండియా’ కూటమి స్వార్థపరుల బృందమని ఎద్దేవా చేశారు.

శ్రీరాముడంటే ఎన్టీఆర్‌..

‘‘శ్రీరాముడి భవ్య మందిరాన్ని అయోధ్యలో నిర్మించాం.. తెలుగు ప్రజలు ప్రతి ఇంటా రాముడికి స్వాగతం పలికారు’’ అని మోదీ పేర్కొన్నారు. అయితే... తెలుగు వారు రాముడిని గుర్తుకు తెచ్చుకుంటే మనకళ్ల ముందు మెదిలేది ఎన్టీఆర్‌ అని తెలిపారు. ‘‘రాముడు, కృష్ణుడిలా ఎన్టీఆర్‌ గొప్పగా కనిపించి ఆ దేవుళ్లిద్దరినీ ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారు. పేదలు, రైతుల కోసం ఎన్టీఆర్‌ చేసిన సేవను మనం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవం కోసం ఆయన కాంగ్రె్‌సతో పోరాడారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఆయన శతజయంతి సందర్భంగా స్మారక నాణెం విడుదల చేసింది. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇచ్చింది. కానీ.. కాంగ్రెస్‌ ఆ ఇద్దరినీ అవమానించింది’’ అని మండిపడ్డారు. తాము రాజకీయాలకు అతీతంగా భారత దేశ ముద్దు బిడ్డల్ని గౌరవిస్తామని... కాంగ్రెస్‌ ఇలాంటివి ఏవీ చేయదని విమర్శించారు.

ఏపీలో మంత్రులు ప్రజాసేవను పక్కనపెట్టేశారు. ఒకరిని మించి ఒకరు అవినీతి చేయడంలో పోటీ పడుతున్నారు. గత ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మీరందరూ ముందుకొచ్చి ఎన్డీయేకు ఓటు వేయాలి!

- ప్రధాని నరేంద్ర మోదీపోలీసులు ఎక్కడ?

Updated Date - Mar 18 , 2024 | 04:11 AM