Share News

కోడ్‌ ఉల్లంఘనలపై కొరడా

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:00 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అధికార యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 109 మందిపై కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు వేటు వేశారు.

కోడ్‌ ఉల్లంఘనలపై కొరడా

109 మందిపై వేటు

రాయదుర్గంలో అత్యధికం.. కళ్యాణదుర్గంలో జీరో

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 21: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అధికార యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 109 మందిపై కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు వేటు వేశారు. అనంతపురం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో వలంటీర్లు, డీలర్లు, రేషన సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, రెగ్యులర్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ విడుదల చేసిన బులెటిన ప్రకారం అత్యధికంగా రాయదుర్గం నియోజకవర్గంలోనే 29 మందిపై ఉల్లంఘనల కింద వేటు వేసారు. ఇందులో వలంటీర్లు 23 మంది ఉండగా డీలర్లు నలుగురు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇద్దరు ఉన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 19 మందిపై వేటు పడగా వీరిలో వలంటీర్లు 14 మంది, డీలర్లు ఇద్దరు, కాంట్రాక్‌ ఉద్యోగులు ముగ్గురు చర్యలకు గురయ్యారు. గుంతకల్లు నియోజకవర్గంలో వలంటీర్లు ఆరుగురు, డీలర్లు ఇద్దరు చొప్పున 8 మందిపై వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గంలో 24మందిపై కోడ్‌ ఉల్లఘించినందులకు వేటు వేశారు. ఇందులో 11మంది వలంటీర్లు, 11మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. శింగనమల నియోజకవర్గంలో 19మందిపై చర్యలు తీసుకోగా ఇందులో 10మంది వలంటీర్లు, ఇద్దరు డీలర్లు, ఐదుగురు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఇద్దరు రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. అనంతపురం అర్బన నియోజకవర్గంలో ఇప్పటికి నలుగురిపై మాత్రమే చర్యలు తీసుకోగా వారిలో ముగ్గురు వలంటీర్లు ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఆరుగురిపై వేటుపడగా వీరిలో వలంటీర్లు ముగ్గురు, డీలర్‌ ఒకరు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇద్దరు ఉన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోడ్‌ ఉల్లంఘనలపై ఒక్కరిపై కూడా చర్యలు లేకపోవడం విశేషం.

Updated Date - Apr 22 , 2024 | 12:01 AM