మళ్లీ ఫ్లోటింగ్.. టింగ్!
ABN , Publish Date - Mar 03 , 2024 | 03:26 AM
విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన అలల వంతెన(ఫ్లోటింగ్ బ్రిడ్జి) వారం తిరక్కుండానే మరోసారి తెగిపోయింది.
మరోసారి కొట్టుకుపోయిన బ్రిడ్జి వ్యూ పాయింట్
ముంబై నిపుణుల తనిఖీలతో కనిపించని ఫలితం
వారంలోపే 2 సార్లు తెగిపోయిన వంతెన
ఇదీ మాక్ డ్రిల్లేనంటారా?
విశాఖపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన అలల వంతెన(ఫ్లోటింగ్ బ్రిడ్జి) వారం తిరక్కుండానే మరోసారి తెగిపోయింది. శనివారం ఉదయం ‘టి-జంక్షన్ వ్యూ పాయింట్’ బ్రిడ్జి నుంచి విడిపోయి దూరంగా కొట్టుకుపోయింది. దానిని పట్టుకోవాలని యత్నించిన లైఫ్‌గార్డ్ సముద్రంలో పడిపోయారు. వీఎంఆర్‌డీఏ అధికారులు, వైసీపీ నాయకులు ఫిబ్రవరి 25న దీనిని ప్రారంభించారు. ఆ మరుసటి రోజు నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే దానికి ముందే ‘టి’ జంక్షన్ వ్యూ పాయింట్ అలల ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారులు దీనిని ఖండించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా దానిని తామే దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశామంటూ ఓ వీడియో విడుదల చేశారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వీఎంఆర్‌డీఏ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆరోపించారు. ఆ తర్వాత 24 గంటల్లో పర్యాటకులను అనుమతిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకూ దానిని అందుబాటులోకి తేలేదు. ప్రాజెక్టును ఏర్పాటు చేసిన సంస్థ రోజూ దానితో తిప్పలు పడుతునే ఉంది. రెండు రోజుల క్రితం ముంబై నుంచి ఓ బృందాన్ని తీసుకువచ్చి తనిఖీ చేయించింది. అయినా ప్రయోజనం శూన్యం. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎలాగైనా ప్రారంభించాలని అధికారులు చాలా పట్టుదలగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.