Share News

రైతులపై కాల్పులు అమానుషం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:16 AM

రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం కాల్పులు చేయడం అమానుషమని, కాల్పులు విరమించి వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు.

రైతులపై కాల్పులు అమానుషం
రైతులకు సంఘీభావంగా పత్తికొండలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తు...

రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం కాల్పులు చేయడం అమానుషమని, కాల్పులు విరమించి వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతుల పోరాటానికి సంఘీభావంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాలు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు.

ఎమ్మిగనూరు రూరల్‌/ఆలూరు/హొళగుంద/పత్తికొండ టౌన్‌, ఫిబ్రవరి 26: జాతి సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ డౌన్‌డౌన్‌ అని నినదిస్తూ సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో బైకు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో బైకు ర్యాలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమప్ప సర్కిల్‌లో నాయకులు రామాంజనేయులు, గోవిందు, తిమ్మగురుడు, వీరేష్‌, ప్రసాద్‌, యేసేపు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రెండవ దఫా రైతాంగ పోరాటాన్ని ప్రారంభించారని, ఈ పోరాటాన్ని అణచేందుకు మోదీ ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీలో నాయకులు రంగన్న, భాస్కర్‌యాదవ్‌, చినన్న, రాముడు, సురేష్‌, ఆంథోని, దాదావలి, సమీఉల్లా, మల్లికార్జునగౌడు, ఆజాద్‌, సుంకన్నలు పాల్గొన్నారు.

ఆలూరులో బైక్‌ ర్యాలీ

వాఢిల్లీలో రైతు పోరాటానికి సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ధర్నా చేశారు. సీపీఐ మండల కార్యదర్శి పి.రామాంజనేయులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణస్వామి, సీపీఎం మండల కార్యదర్శి షాకీర్‌ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా హామీ నెరవేర్చలేదని విమర్శించారు. హామీల అమలును కోరుతూ రైతులు ఆందోళన చేపడితే కాల్పులు జరిపి రైతులను బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి సీ గోపాల్‌, ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షులు పులి రంగన్న, రైతు సంఘం మండల కార్యదర్శి అగ్రహారం ఈరన్న, సీపీఎం హాలహర్వి మండల కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిరసన ప్రదర్శన

రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులపై పోలీసుల కాల్పులు చేయడం అమానుషమని సీపీఐ, రైతు సంఘం, సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు పెద్దహ్యాట్ట మారెప్ప, తిమ్మయ్య వెంకటేష్‌, అమాన్‌ అన్నారు. హొళగుందలోని వాల్మీకి సర్కిల్‌ నుంచి బస్టాండ్‌ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. మోదీ రైతుల ఉద్యమాన్ని పోలీసులతో అణగతొక్కాలని చూడటం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో రంగన్న, కృష్ణ, శ్రీరంగ, నాగరాజు, మోదిన్‌, షబ్బీర్‌, మస్తాన్‌ పాల్గొన్నారు.

అన్నదాతల్ని చంపేస్తారా...?

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టిన అన్నదాతలను చంపేయడమే రామరాజ్యమా.. అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబీరసూల్‌, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య, రైతు సంఘం తాలుకా అధ్యక్షుడు ఈరన్న, సీఐటీయూ నాయకులు వెంకటేశ్వరరెడ్డి ప్రశ్నించారు. పత్తికొండలో వామపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రైతులు సన్నద్దం కావాలని కోరారు. కార్యక్రమంలో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు ఉమాపతి, నెట్టికంటయ్య, పెద్దయ్య, ఆల్తాఫ్‌, కారుమంచి, వెంకట్రాముడు, దస్తగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:17 AM