Share News

గ్యాస్‌పైపు లీకై అగ్నిప్రమాదం

ABN , Publish Date - May 27 , 2024 | 03:57 AM

ఇంటింటికీ సరఫరా చేసే గ్యాస్‌ పైపులైన్‌ లీకవడంతో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు తీవ్ర గాయాలపాలైన ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

గ్యాస్‌పైపు లీకై అగ్నిప్రమాదం

నలుగురికి తీవ్ర గాయాలు.. ఐదేళ్ల బాలుడి పరిస్థితి విషమం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ /నూజివీడు టౌన్‌, మే 26: ఇంటింటికీ సరఫరా చేసే గ్యాస్‌ పైపులైన్‌ లీకవడంతో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు తీవ్ర గాయాలపాలైన ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వీరవల్లి పోలీసుల కథనం ప్రకారం.. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా నిమిత్తం మేఘా గ్యాస్‌ కంపెనీ పైపులైన్లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే రేమల్లెలో మోహన్‌ స్పింటెక్స్‌ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌కు కూడా గ్యాస్‌ పైపులైన్లు నిర్మించింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సాయినాథ్‌.. మోహన్‌ స్పింటెక్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ, కుటుంబంతో కలిసి ఫ్యాక్టరీ ఆవరణలోని క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున పనికెళ్లే నిమిత్తం వంట కోసం గ్యాస్‌ పొయ్యి అంటించగా అప్పటికే లీకైన గ్యాస్‌ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సాయినాథ్‌తో పాటు ఆయన భార్య లక్ష్మీబాయి, అక్కడే ఉన్న ఐదేళ్ల యువరాజుతో సహా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఫ్యాక్టరీ సిబ్బంది తక్షణం క్షతగాత్రులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మోహన్‌ స్పింటెక్స్‌ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరసింహమూర్తి తెలిపారు.

Updated Date - May 27 , 2024 | 03:57 AM