విశాఖకు ‘ఫినిషింగ్’ టచ్!
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:31 AM
జనం చెవిలో ఎల్లకాలం పూలు పెడుతూనే ఉండొచ్చని... ఉత్తరాంధ్ర ప్రజలను మరింత ఈజీగా మభ్యపెట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్లుంది!
ఎన్నికల ముందు జగన్ ‘విజన్’ డ్రామా
విశాఖకు ‘ఫినిషింగ్’ టచ్!
పారిశ్రామికవేత్తలకూ చెవిలో పూలు
ఐకానిక్ నిర్మాణాలంటూ కొత్త పాట
‘విశాఖలో కాపురం’ మళ్లీ వాయిదా
అమరావతిలో విపక్షాల భూములున్నాయట
మరి విశాఖలో వైసీపీ నేతల దందా మాటేమిటో!
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
జనం చెవిలో ఎల్లకాలం పూలు పెడుతూనే ఉండొచ్చని... ఉత్తరాంధ్ర ప్రజలను మరింత ఈజీగా మభ్యపెట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్లుంది! ‘విశాఖ’ చుట్టూ ఆయన అల్లిబిల్లి కథలు అల్లుతూనే ఉన్నారు. మరో వారం పదిరోజుల్లో ఎన్నికల షెడ్యూలు వస్తున్న సమయంలో... ‘విజన్ విశాఖ’ అంటూ కనికట్టు చేశారు. ‘ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు’ అంటూ ముద్దుముద్దుగా చెప్పారు. భూములు కొల్లగొట్టి, రుషికొండకు గుండు కొట్టి, పరిశ్రమలను వెళ్లగొట్టి, పెట్టుబడిదారులను బెదరగొట్టిన ఆయన ఎప్పుడో విశాఖను ‘ఫినిష్’ చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ ‘టచ్’ చేస్తున్నారు. మంగళవారం విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో సమానంగా పోటీ పడాలంటే... రాజధాని మార్పు అనివార్యం అని జగన్ పేర్కొన్నారు. అదే సమయంలో రాజధానిగా అమరావతిని వ్యతిరేకించడం లేదని, అది శాసన రాజధానిగా ఉంటుందని పాతపాటే పాడారు. ‘‘అక్కడ 50 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలంటే ఏడాదికి రూ.5 వేల కోట్లు కావాలి. అంత డబ్బు పెట్టలేం. పైగా అక్కడ చుట్టుపక్కల భూములన్నీ ప్రతిపక్ష నాయకుల చేతుల్లో ఉన్నాయి. బినామీలు ఉన్నారు’’ అని అలవోకగా అవే అబద్ధాలు చెప్పారు. పారిశ్రామికవేత్తల సాక్షిగా జగన్ వల్లెవేసిన కబుర్లు, అసలు వాస్తవాలు ఏమిటో చూద్దాం...
జగన్ మాట: అమరావతిలో టీడీపీ నేతలు, బినామీల భూములు ఉన్నాయి.
మరి విశాఖలో: అమరావతిలో భూముల స్కామ్, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రచ్చ చేస్తున్నారు. కానీ... ‘ఇన్‌సైడర్’ లేనేలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అదే సమయంలో... విశాఖలో వైసీపీ నేతలు భారీగా భూములను దున్నే పని మొదలుపెట్టారు. వారికి కొమ్ముకాస్తున్న ఐఏఎస్ అధికారులు కూడా వందల ఎకరాలను పోగేసుకున్నారు. బలవంతంగా లాక్కున్నారు. విశాఖ-భోగాపురం బీచ్ కారిడార్ అంతా ఇదే బాగోతం. ఈ భూముల రేట్లు పెంచుకోవడానికే... విశాఖను ‘పరిపాలనా రాజధాని’గా ప్రకటించారనే అనుమానాలున్నాయి.
జగన్ మాట: సీఎంగా ఇక్కడికి వచ్చి ఉంటే విశాఖ అభివృద్ధి చెందుతుంది. అది ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. ఏదేమైనా సరే... ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను. ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా!
అసలు వాస్తవం: ‘మీ బిడ్డ విశాఖలోనే కాపురం పెడతాడు’ అని జగన్ అనేకసార్లు చెప్పారు. దసరా, దీపావళి, సంక్రాంతి అంటు వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు... ‘ఎన్నికల తర్వాత’ అని మరో కొత్త మాట చెప్పారు. విశాఖకు రాకుండా ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. తమ భూములు తీసుకొని, రోడ్డున పడేస్తున్నారనే అమరావతి రైతులు కోర్టులను ఆశ్రయించారు.
జగన్ మాట: విశాఖ పరిపాలనా రాజధాని కావాలని
బలంగా కోరుకున్నది, దాని కోసం స్థిరంగా నిలబడింది నేనొక్కడినే!
ఔను నిజమే: ఇది మాత్రం నూరు శాతం కరెక్ట్. రకరకాల తప్పుడు ఉద్దేశాలు, అజెండాతో అమరావతిని అటకెక్కించి... విశాఖను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. అంతేతప్ప విశాఖపై ఆయనకు ఎలాంటి ప్రేమా లేదు. పరిపాలనా రాజధాని కావాలని ఈ ప్రాంత ప్రజలు ఏనాడూ కోరుకోలేదు. నగరం ప్రశాంతంగా ఉండాలనే కోరుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖలో భూములపై పడి, ఇళ్లకు వెళ్లి తుపాకులతో బెదిరించిన ముఠాలను చూశాక... ‘మాకు రాజధాని వద్దు బాబోయ్’ అంటూ అంతా వ్యతిరేకిస్తున్నారు. సీఎంగా ఒక్క పూట విశాఖ పర్యటనకు వస్తేనే సామాన్యులను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక జగన్ ఇక్కడే ఉంటే ఏమైనా ఉందా... అని విశాఖ వాసులు వణికిపోతున్నారు.
జగన్ మాట: విశాఖకు ‘ఫినిషింగ్ టచ్’ చేస్తే చాలు.
ఇన్నేళ్లు ఏం చేశారో: ‘ఫినిషింగ్ టచ్’ ఎన్నికల ముందే గుర్తుకొచ్చిందా? విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజువాక నుంచి మధురవాడ వరకు 12 ఫ్లైఓవర్లు నిర్మిస్తామని ఐదేళ్లుగా చెబుతూనే ఉన్నారు. దీనికి ఎవరు అడ్డం పడ్డారు?
జగన్ మాట: విశాఖలో ఐకానిక్ సెక్రటేరియట్ కడతాం!
నమ్మేదెవరు: అమరావతిలో పదివేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులు జరిగినా ‘అన్నీ గ్రాఫిక్స్. ఒక్క ఇటుక కూడా పడలేదు. అది శ్మశానం. ఎడారి’ అని అబద్ధాలు ప్రచారం చేశారు. సచివాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి చేపట్టిన ‘ఐకానిక్ టవర్స్’ నిర్మాణ పనులు అప్పటికే మొదలయ్యాయి. వాటితోపాటు మొత్తం రాజధాని పనులను జగన్ ఆపివేయించారు. ఇప్పుడు... ప్రపంచం, దేశమంతా గర్వంగా విశాఖ వైపు చూసేలా ఐకానిక్ నిర్మాణాలు చేపడతామని కబుర్లు చెబుతున్నారు. ఐకానిక్ సెక్రటేరియట్, ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, ఐకానిక్ స్టేడియం నిర్మిస్తారట! ‘ఫినిషింగ్ టచ్’లు చాలంటున్న ఆయన... ఇన్ని ‘ఐకానిక్’ నిర్మాణాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు?
జగన్ మాట: యువతకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ బోధించేందుకు చక్కటి విద్యా సంస్థ ఏర్పాటు చేస్తాం.
పాత పాటే: ఈ మాట మూడేళ్ల క్రితమే చెప్పారు. ఐటీకి సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా ఓ యూనివర్సిటీ పెడతామన్నారు. ఏపీఐఐసీతో ప్రకటన కూడా చేయించారు. రుషికొండ ఐటీ హిల్స్‌లో పెడతామన్నారు. ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదు.
జగన్ మాట: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంతో నిర్మితమవుతోంది. ఇంకో 18 నెలల్లో అక్కడి నుంచి విమానం ఎగురుతుంది.
కట్టారా.. అడ్డుకున్నారా: ఈ విమానాశ్రయం నిర్మాణానికి టీడీపీ హయాంలోనే శంకుస్థాపన చేశారు. వైసీపీ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఈపాటికే నిర్మాణం పూర్తయ్యేది. కానీ.. స్వప్రయోజనాలు చూసుకున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేటాయించిన భూముల్లో అనువుగా ఉన్న 500 ఎకరాలను భవిష్యత్తు అవసరాలకు పక్కన పెట్టుకున్నారు. ఆ పరిసరాల్లో భూములు వైసీపీ నేతలు కొనుక్కున్నారు. నాలుగేళ్ల తరువాత మరోసారి శంకుస్థాపన చేశారు.
ఉద్యోగ కల్పన దిశగా చదువులు
స్కిల్ హబ్, కాలేజీ, వర్శిటీల ఏర్పాటు
‘భవిత’ ప్రారంభోత్సవంలో జగన్ వెల్లడి
విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థలో అనేక మార్పులను తీసుకు వస్తున్నామని, చదివే చదువుకు అనుగుణంగా ఉద్యోగాలు పొందేలా సంస్కరణలు చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. స్కిల్ డెవల్‌పమెంట్, సీడాప్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘ద కాస్కేడింగ్ స్కిల్స్-భవిత’ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన విశాఖలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. పైలట్ ప్రాజెక్టుగా 158 పారిశ్రామిక సంస్థలు ఏకంగా 208 ఐ.టి.ఐ., పాలిటెక్నిక్ కాలేజీలతో కలిసి పనిచేస్తున్నాయని, విద్యార్థులకు శిక్షణ ఇప్పించడంతోపాటు ఉద్యోగాలను అం దించే బాధ్యతను తీసుకున్నాయన్నారు. ఇకపై దీన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళతామని తెలిపారు.నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు.
హై స్పీడ్ రైలు కారిడార్
హైదరాబాద్-విశాఖ, విజయవాడ-కర్నూలు ప్రాంతాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుచేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే, ఏపీకి కేంద్రం 12 రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. వాటికి రాష్ట్ర వాటా రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తం కట్టకపోవడం వల్ల ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇవికాకుండా కేంద్రం మరో ప్రాజెక్టుకు సంబంధించి రూ.400 కోట్లు మంజూరు చేసిం ది. దానికి అవసరమైన భూములు కేటాయించక పనులు ఆగిపోయాయని బీజేపీ నేతలు అంటున్నారు.