Share News

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:03 AM

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్‌ మండలం స్వర్ణ భారతి నగర్‌లోని కృష్ణతులసి నగర్‌ డి బ్లాక్‌ కు చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఆదివారం ‘ఏకలవ్య’ తరహాలో నిరసన చేపట్టారు.

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం.. బాధితురాలు గుంటూరు మహిళ

మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై ఏకరువు

గంజాయి, ఫోర్జరీతో భూకబ్జాలు, ఎన్నో ఘోరాలని ఆందోళన

ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజేఐకి వినతులు

గుంటూరు, ఏప్రిల్‌ 21 : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్‌ మండలం స్వర్ణ భారతి నగర్‌లోని కృష్ణతులసి నగర్‌ డి బ్లాక్‌ కు చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఆదివారం ‘ఏకలవ్య’ తరహాలో నిరసన చేపట్టారు. ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద అనుచరులతో నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కుని కలకలం రేపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనమంటూ ఆమె ఆక్రోశించారు. ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆమె మూడురోజుల క్రితం మహిళా, ప్రజా సంఘాల నాయకులు బొందలపాటి అమరేశ్వరి, మారిపాక జయమ్మ, నూతక్కి కృష్ణరేఖ, గణేష్‌, నామాల నాగార్జున తదితరులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలిసేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో వారి కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించారు. అనంతరం ఆదివారం సాయంత్రం ఆమె తన ఎడమ చేయి బొటనవేలు నరుక్కున్నారు. ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. ఆమె కథనం మేరకు.. కోపూరి లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. మాజీ హోం మంత్రి సుచరిత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో ఓ ముఠా...చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేయడం, వారితో విక్రయించడం, నేరాలు చేయించడం ద్వారా వారిలో నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వీటిపై ప్రశ్నిస్తే.. అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ తమపై తప్పుడు ప్రకటనలిచ్చి అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.41వ డివిజన్‌లో భూకబ్జాలు, ప్రభుత్వాధికారుల సంతకాలను సుచరిత అనుచరులే చేస్తున్నారని తెలిపారు. ఎస్పీలు, కలెక్టర్‌లకు ఫిర్యాదులు చేసినా, వారు చర్యలకు ఆదేశించినా, కేసులు నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

ప్రధాని, రాష్ట్రపతి, మానవ హక్కుల

కమిషన్‌లో ఫిర్యాదులు: బాధితురాలు

ఏపీలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. మూడు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్నాను. జాతీయ మానవ హక్కుల కమిషన్‌, ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయాల్లో ఆయా ఫిర్యాదులు అందించాను. చివరిగా ఆదివారం సాయంత్రం ఎడమ చేయి బొటనవేలు నరుక్కున్నాను. నేను చేసిన ఆయా ఆరోపణలకు అన్ని ఆధారాలూ ఉన్నాయి. ప్రతి దానినీ నిరూపిస్తాను. రాష్ట్రంలో ఈ అవినీతి, అక్రమాలు ప్రపంచం దృష్టికి తీసుకురావడం కోసమే గత్యంతరం లేక ఇలా నిరసనకు దిగాల్సి వచ్చింది..

Updated Date - Apr 22 , 2024 | 04:03 AM