Share News

తిరోగమనంలో రాష్ట్రం!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:17 AM

రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తీవ్రమైన అప్పులతో ఆర్థిక అసమానతలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి పీవీ రమేశ్‌ వ్యాఖ్యానించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి’ అనే అంశంపై విజయవాడలోని పీబీ

తిరోగమనంలో రాష్ట్రం!

ప్రభుత్వ అప్పులతో ఆర్థిక అసమానతలు

నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యానికి చేటు

తల్లిదండ్రుల ఆస్థి బదలాయింపునకు 6 నెలలు హైరానా

కుమారుడివని నిరూపించుకోవాలని తహశీల్దార్‌ నోటీసులు

అడుగడుగునా సర్కారు వైఫల్యం: పీవీ రమేశ్‌

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం: వి.లక్ష్మణరెడ్డి

శాంతిభద్రతల పరిస్థితి దారుణం: హైకోర్టు న్యాయవాది రవితేజ

విజయవాడ (మొగల్రాజపురం), ఏప్రిల్‌ 15: రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తీవ్రమైన అప్పులతో ఆర్థిక అసమానతలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి పీవీ రమేశ్‌ వ్యాఖ్యానించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి’ అనే అంశంపై విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో సోమవారం సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీవీ రమేశ్‌ మాట్లాడుతూ ప్రపంచం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వెనుక పరిగెడుతుంటే, మనం 19వ శతాబ్దం నాటి విషయాల వద్దే ఆగిపోయామన్నారు. పాలకుల నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తున్నాయన్నారు. లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలు నగదు బదిలీ పథకాలు తీసుకొచ్చి నష్టపోయాయని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా బటన్‌ నొక్కి ప్రజల ఖాతాల్లోకి డబ్బులు పంపే విధానం అమలవుతోందని, దీనివల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ, ప్రజల ఆస్తులైన మట్టి, ఇసుక, గనులు దోచుకోవడం బాధాకరమన్నారు. అప్పులు రాష్ట్ర జీడీపీతో సమానంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లలో పోలవరం పూర్తి చేయకపోవడం, రాజధాని నిర్మాణం ఆగిపోవడానికి పాలకుల వైఫల్యం కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాల వల్ల వ్యవస్థలు పనిచేయలేని దుస్థితికి వచ్చాయని తెలిపారు. ‘నా విషయానికి వస్తే.. మా తల్లిదండ్రుల మరణానంతరం వారి పేరిట ఉన్న ఆస్తిని నా పేరిట మార్చుకోడానికి దాదాపు ఆరు నెలల నుంచి నానా హైరానా పడాల్సి వచ్చింది మీరు ఫలానా వారి కుమారుడు అని నిరూపించుకోమని తహసీల్దార్లు, కలెక్టర్లు నోటీసులు ఇస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు కోర్టు తీర్పులను కూడా లెక్కచేయని స్థితికి వచ్చారని, ప్రభుత్వ సలహాదారులు ప్రజాధనం నుంచి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకుల్లా తమ నాయకుడి కోసం పనిచేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇలాంటి కారణంతోనే 1975లో అలహాబాద్‌ కోర్టు ఇందిరా గాంధీని ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు పన్నుల ద్వారా చెల్లిస్తున్న సొమ్ముతో చేపట్టే పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఒక చే త్తో సంక్షేమ పథకాలను ఇస్తున్నామని చెబుతున్న పాలకులు మద్యం విక్రయాల ద్వారా మళ్లీ వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయం సుమారు రూ.74వేల కోట్లు కాగా, అందులో మద్యం విక్రయాల ద్వారా రూ.22 వేల కోట్లు వ స్తోందని చెప్పారు. మనరాష్ట్ర బడ్జెట్‌ రెండున్నర లక్షల కోట్లకు పైగా ఉందని, అప్పులు చూస్తే ఐదున్నర లక్షల కోట్లు దాటాయని తెలిపారు. చంద్రబాబు రుణమాఫీ అంటే తేలిన లెక్క రూ.80వేల కోట్లు అని, దానికి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని అప్పటి రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా బటన్‌ నొక్కే, ఆస్తులు అమ్మే అవకాశాలు ఉన్నా ఆ పని చేయలేదని, ఇతర మార్గాల ద్వారా రైతులను ఆదుకున్నామని తెలిపారు.

విజయవాడకు మళ్లీ కులం రంగు..

హైకోర్టు న్యాయవాది రవితేజ మాట్లాడుతూ రాజకీయ చైతన్యం ఉన్న విజయవాడకు మళ్లీ కులం రంగు పూయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. 2022 లెక్కల ప్రకారం మహిళలపై అకృత్యాల విషయంలో రాష్ట్రంలో 25వేల కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. రూ.450 కోట్లతో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టి ఇంకో పక్క ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణన్నారు. హైదరాబాద్‌ యూనివర్సిటీ రాజనీతిశాస్త్ర ఆచార్యుడు కొండవీటి చిన్నయసూరి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజలను లబ్ధిదారులుగా మార్చి వారి ఓట్లతో అధికారంలోకి వస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాష్ట్రంలో ప్రతి మనిషి తలపై రూ.2 లక్షల అప్పు ఉందని, రాష్ట్రంలో ఏ రకం ఆర్థిక వ్యవస్థ అమలవుతోందో తెలియడం లేదని చెప్పారు. రాష్ట్ర విభ జన తరువాత రాజధాని లేకుండా పోయిందని, అమరావతి కాదని విశాఖపట్నం అన్నారని, అక్కడ కూడా ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ నేటి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 2.5 శాతం మాత్రమే ప్రాజెక్టులకు ఖర్చు చేశారని, అక్షరాస్యతలో ఏపీ 30వ స్థానంలో ఉందని తెలిపారు. రూ.12లక్షలకోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం పొందుతున్న వలంటీర్లను విధుల నుంచి తప్పించాలని పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు. వారంతా సేవకుల ముసుగులో అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రముఖ న్యాయవాది పదిరి రవితేజ మాట్లాడుతూ నేషనల్‌ క్రైం రికార్ట్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2017లో లక్షా 48వేల నేరాలు నమోదైతే 2022లో రెండు లక్షల నేరాలు నమోదయ్యాయని చెప్పారు. కుల ప్రాతిపదికగా ఓట్లను చీల్చే కార్యక్రమాలు చేస్తున్నారని, రాజధానిని నాశనం చేశారని ఆక్షేపించారు. చర్చాగోష్ఠిలో విజయవాడ మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, అఖిల భారత పంచాయతీ పరిషత్‌ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు, మానవతా సంస్థ చైర్మన్‌ పావులూరి రమేశ్‌ తదితరులు ప్రసంగించారు.

Updated Date - Apr 16 , 2024 | 03:17 AM