పయ్యావులకు అపూర్వ స్వాగతం
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:33 PM
ఆర్థిక, శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు సోమవారం అపూర్వ స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి జిల్లాకు వచ్చారు. జిల్లా సరిహద్దు ప్రాంతం కరిడికొండ వద్దకు ఆయన ఉదయం 11.15 గంటలకు చేరుకున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి తదితరులు ఆయనను గజమాలతో సత్కరించి ఆహ్వానించారు.

సరిహద్దులో ఆహ్వానించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు
కరిడికొండ నుంచి ఉరవకొండ వరకూ జనమే జనం
అడుగడుగునా పూల వర్షం.. బాణసంచా పేలుళ్లు
బాట సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన కేశవ్
అనంతపురం, జూన 17(ఆంధ్రజ్యోతి): ఆర్థిక, శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు సోమవారం అపూర్వ స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి జిల్లాకు వచ్చారు. జిల్లా సరిహద్దు ప్రాంతం కరిడికొండ వద్దకు ఆయన ఉదయం 11.15 గంటలకు చేరుకున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి తదితరులు ఆయనను గజమాలతో సత్కరించి ఆహ్వానించారు. పార్టీ శ్రేణులు బాణ సంచా పేల్చి కేరింతలు కొట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పయ్యావులకు పుష్పగుచ్చాలు అందజేశారు. పయ్యావులను జేసీ ప్రభాకర్‌రెడ్డి అలింగనం చేసుకుని అభినందించారు. అక్కడి నుంచి మంత్రి వాహనాన్ని జేసీ అశ్మితరెడ్డి నడుపుతూ బాట సుంకులమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి సుంకులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అక్కడి నుంచి గుత్తి పట్టణంలోకి ర్యాలీగా చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జయరాం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. గుత్తి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పూల మాల వేసి నివాళులు అర్పించారు. స్వాగత ర్యాలీ జాయతీ రహదారి మీదుగా పామిడికి చేరుకోగానే స్థానిక నాయకులు స్వాగతం పలికారు. కల్లూరులో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, రాష్ట్ర నాయకులు ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులు మంత్రికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గార్లదిన్నె మీదుగా అనంతపురం నగర శివారులోని తపోవనం వద్దకు ర్యాలీ చేరుకుంది. అక్కడ అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో మంత్రి కేశవ్‌కు స్వాగతం పలికారు. ఎక్కడ చూసినా జై పయ్యావుల అంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. మంత్రికి స్వాగతం పలికిన నాయకులలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్న, రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, మాజీ మేయర్ స్వరూప, కాపు కార్పొరేషన మాజీ డైరెక్టర్ రాయల్ మురళి, గాండ్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ విశాలాక్షి తదితరులు ఉన్నారు.