పండుటాకుల అవస్థలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:25 PM
వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్లే తమకు పింఛన్లు ఆలస్యంగా వచ్చాయని పండు టాకులు ఆవేదన వ్యక్తం చేశారు.

పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారం
ఉదయాన్నే సచివాలయాలకు చేరుకున్న పింఛనుదారులు
పెనగలూరు/ఒంటిమిట్ట/రైల్వేకోడూరు, ఏప్రిల్ 3: వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్లే తమకు పింఛన్లు ఆలస్యంగా వచ్చాయని పండు టాకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువు లతో పాటు ప్రభుత్వం నుంచి సామాజిక పెన్షన్లు పొందుతున్న వర్గాలు ఎండలో ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే పెన్షనర్లు సచివాలయాల వద్ద పడిగాపులు కాసి ఉసూరుమన్నారు. కొన్నిచోట్ల సాయంత్రం క్యూలైన్లలో నిల్చోబెట్టి ఇవ్వగా, మరికొన్ని చోట్ల ఇంకా డబ్బులు రాలేదని వెనక్కు పంపారు. కాగా వైసీపీ ప్రభుత్వం మాత్రం... టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కక్ష కట్టి వలంటీర్లను పంపిణీ చేయకుండా చేసిందని, దీంతో ఇంటి వద్దకు పెన్షన్లు తెచ్చి ఇవ్వలేకపోయామని హైడ్రా మాకు తెరలేపింది.
పెనగలూరు మండలంలోని 14 గ్రామ సచివాలయాల పరిధిలో బుధవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. గ్రామ కార్యదర్శులు బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకునేందుకు మధ్యాహ్నం వరకు సమయం పట్టడంతో పింఛన్‌దారులు సచివాలయాల వద్ద ఎదురు చూడాల్సి వచ్చింది. సచివాలయాల వద్ద కనీసం షామియానా కూడా వేయకపోవడంతో నిలువ నీడలేక ఆకలిదప్పులతో పింఛన్‌దారులు తల్లడిల్లిపోయారు. నాలుగు గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఒంటిమిట్ట మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీ పరిధిలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయాల్లో ఆలస్యంగా పంపిణీ చేశారు. లబ్ధిదారులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి పంపిణీ చేపట్టారు. మండల వ్యాప్తంగా 4329 మంది లబ్ధిదారులుండగా సాయంత్రం ఏడు గంటల వరకు 60 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశామని ఎంపీడీవో రామచంద్ర తెలిపారు.
రైల్వేకోడూరు మండలంలోని గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారులు పింఛన్ల కోసం పడిగాపులు కాశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతు వులు ఇబ్బందులు పడినట్లు తెలిసింది.