Share News

ఫిబ్రవరి మండింది!

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:05 AM

పసిఫిక్‌ మహా సముద్రంలో గతేడాది ప్రారంభమైన ఎల్‌నినో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ఠ స్థాయికి చేరింది. దీనిని కొందరు వాతావరణ నిపుణులు సూపర్‌ ఎల్‌నినోగా పేర్కొంటున్నారు.

ఫిబ్రవరి మండింది!

విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పసిఫిక్‌ మహా సముద్రంలో గతేడాది ప్రారంభమైన ఎల్‌నినో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ఠ స్థాయికి చేరింది. దీనిని కొందరు వాతావరణ నిపుణులు సూపర్‌ ఎల్‌నినోగా పేర్కొంటున్నారు. ఎల్‌నినో కారణంగానే 2023 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. ఎల్‌నినో కొనసాగుతున్నందున ఈ ఏడాది జనవరితోపాటు ఫిబ్రవరిలో కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1991-2020 మధ్య నమోదైన ఉష్ణోగ్రతల సగటును పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 0.81 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. గతంలో 2016 ఫిబ్రవరిలో సగటు కంటే 0.12 డిగ్రీలు ఎక్కువగా నమోదు కాగా, ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించిందని స్కైమెట్‌ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది మొదలైన వేడి వాతావరణం 2024లో కూడా కొనసాగుతూనే ఉంది. దీంతో ఫిబ్రవరిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు యూర్‌పలోని కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌ తెలిపింది. గతంలో 2015 చివరిలో పసిఫిక్‌ సముద్రంలో సూపర్‌ ఎల్‌నినో ఏర్పడడంతో 2016 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. గతేడాది ప్రారంభంలో పసిఫిక్‌ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అత్యంత వేడిగా మారినందున 2023ను సూపర్‌ ఎల్‌నినో సంవత్సరంగా నిపుణులు పేర్కొంటున్నారు. సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో గతేడాది జూలైలో తొలుత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఫిబ్రవరి వరకు వరుసగా తొమ్మిదో నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదుకావడం కూడా రికార్డని వాతావరణ శాఖ రిటైర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. వాతావరణం వేడెక్కడానికి ఎల్‌నినోతోపాటు మానవ ప్రేరితమైన కారణాలు కూడా ఉన్నాయని వివరించారు.

Updated Date - Mar 09 , 2024 | 02:06 AM