‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:15 AM
తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు.
పథకం మార్గదర్శకాలు విడుదల చేయలేదు: విద్యాశాఖ
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. పథకం విధి విధానాలను ప్రభుత్వం తర్వాత ప్రకటిస్తుందన్నారు. అయితే ఈ పథకంలో అర్హతల పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాటిని విశ్వసించొద్దని ప్రజలను కోరుతూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆధార్ ఆధారంగా పథకాలు అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం ఆధార్ చట్టం 2016 రెగ్యులేషన్స్‌పై గెజిట్ విడుదల చేయాల్సి ఉందని, దానినే ఇటీవ విడుదల చేసినట్లు వివరించారు. ఆ గెజిట్ కేవలం కేంద్ర ఆధార్ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్య మాత్రమేనన్నారు. ఆ గెజిట్‌లో ఎక్కడా తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు పొందుపరచలేదని పేర్కొన్నారు. కాగా.. ఆధార్ నిబంధనల గురించి ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను జగన్ మీడియా వక్రీకరించింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా దుష్ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వం అర్హతల గురించి స్పష్టంచేసినట్లు, కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తించనున్నట్టు ప్రచారం చేస్తోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది.