Share News

కూలిన బతుకులు

ABN , Publish Date - May 19 , 2024 | 03:26 AM

పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు.. వెంచర్‌ ముఖద్వారం స్లాబ్‌ వేస్తుండగా ప్రమాదంలో మరణించారు.

కూలిన బతుకులు

వెంచర్‌ ముఖద్వారం స్లాబ్‌ కూలడంతో ఇద్దరు మధ్యప్రదేశ్‌ కూలీల మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

కూడేరు, మే 18: పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు.. వెంచర్‌ ముఖద్వారం స్లాబ్‌ వేస్తుండగా ప్రమాదంలో మరణించారు. పిల్లర్లు కూలిపోవడంతో కాంక్రీట్‌లో కడ్డీల మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్కూరు గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. శనివారం భవ్యశ్రీ వెంచర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఐదుగురు, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. ముఖద్వారం స్లాబ్‌ వేస్తుండగా ఒక వైపు ఉన్న పిల్లర్లు కూలిపోయాయి. దీంతో పైన ఉన్న మధ్యప్రదేశ్‌ కూలీలు పూరన్‌సింగ్‌ (27), హస (26) కాంక్రీట్‌లో కడ్డీల మధ్య ఇరుక్కుపోయి ఊపిరాడక మృతిచెందారు. మరో ముగ్గురు కూలీలు మధ్యప్రదేశ్‌కు చెందిన తీహరూ, కొర్రపాడుకు చెందిన ఆంజనేయులు, నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంక్రీట్‌ మిక్చర్‌ మధ్య ఇరుక్కుపోయిన కూలీలను బయటకు తీయడానికి యంత్రాలను ఉపయోగించాల్సి వచ్చింది. పిల్లర్లు నాసిరకంగా నిర్మించినందు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లర్లకు చిన్న కడ్డీలు వినియోగించారని, దీంతో స్లాబ్‌ పైభాగం బరువై పిల్లర్లు కూలిపోయాయని అన్నారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - May 19 , 2024 | 07:36 AM