Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

దోపిడీధీర!

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:44 AM

కడప జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన నిక్షేపాలు ఉన్న నియోజకవర్గమది. ఐరన్‌వోర్‌ మొదలుకుని ఇసుక, నాపరాయి..

దోపిడీధీర!

ఖనిజాలమడుగులో ఎమ్మెల్యే కలెక్షన్ల దందా

చిల్లర నుంచి కోట్ల వరకూ వసూళ్లు

ఉమ్మడి కడప జిల్లాలోని ఆ నియోజకవర్గం.. ఒకప్పుడు బాంబుల గడ్డ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కలెక్షన్‌ గడ్డగా మారిందనే పేరు వచ్చింది. ఈ ఘనతంతా స్థానిక ఎమ్మెల్యేదే. చిల్లర వసూళ్ల నుంచి కోట్లు కుమ్ముడు వరకూ దేన్నీ వదలకుండా ఆయన సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీధీరుడి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అక్రమాలను అడ్డుకున్నా, ఫిర్యాదు చేసినా అంతే సంగతులు! హత్యలు లేదంటే ఎదురు కేసులు! ఎమ్మెల్యే వర్గీయుల అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు టీడీపీ నేతలపై కేసులు బనాయించారు. ముంపు పరిహారం కాజేస్తున్నారని సొంత పార్టీకే చెందిన మరో కీలక నాయకుడి అనుచరుడు ఫిర్యాదు చేసినందుకు ఎమ్మెల్యే వర్గీయులు ఆయన్ను హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

భారతికి ఫిర్యాదు చేసినా..

నియోజకవర్గంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీల యజమానులను కొందరిని బెదిరించి ఎమ్మెల్యే కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సిమెంటు పరిశ్రమల ప్రతినిధులు ఈ విషయాన్ని సీఎం జగన్‌

సతీమణి భారతికి ఫిర్యాదు చేశారనే

ప్రచారం ఉంది. అయినా సదరు నేతపై

ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది.

ఉద్యోగాలు, బిల్లుల పేరిట ముడుపులు

ఇసుక నుంచి అన్నింటిలో వాటాలే

సిమెంట్‌ పరిశ్రమల నుంచి కోట్లు కుమ్ముడు

జగన్‌ భార్యకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

మైనింగ్‌ నిర్వాహకుడికి 5 కోట్లు డిమాండ్‌

అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు, హత్యలు

(కడప-ఆంధ్రజ్యోతి)

కడప జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన నిక్షేపాలు ఉన్న నియోజకవర్గమది. ఐరన్‌వోర్‌ మొదలుకుని ఇసుక, నాపరాయి.. ఇలా ఒకటేంటి సహజ వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇది బంగారు నిధిలాంటిది. స్టీలు ప్లాంటు నిర్మాణం కోసం నాలుగు సార్లు శంకుస్థాపన చేశారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటై ఉంటే ఈ ప్రాంతమంతా పారిశ్రమికవాడగా మారేది. కడప జిల్లాకే చెందిన జగన్‌ ముఖ్యమంత్రి అయినా పట్టించుకోలేదు. ఇక స్థానిక ఎమ్మెల్యేకు కూడా అభివృద్ధి అసలు పట్టదు. స్టీల్‌ ప్లాంటు విషయం అటుంచితే పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు (డీకేటీ) పరిహారం కూడా ఇప్పించలేదు. నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. దీంతో నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగానే ఉండిపోయింది. అయితే అక్రమార్జనలో మాత్రం ఎమ్మెల్యే బాగా అభివృద్ధి చెందారు. ఏ చిన్న ఆదాయ వనరును వదలకుండా ముడుపులు దండుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అడ్డగోలుగా ఇసుక తవ్వుకోవడం.. ముంపుపరిహారంలో అనర్హుల పేర్లు చేర్పించి సొమ్ములు నొక్కేయడం.. చివరికి చికెన్‌ సెంటరు నిర్వాహకుల నుంచి కూడా చిల్లర వసూళ్లకు పాల్పడుతున్నారు.

పరిశ్రమల నుంచి కోట్లు

ఈ నియోజకవర్గం ఖనిజాల ఖిల్లా. ఓవైపు నాపరాయి, మరోవైపు ఇసుకతో పాటు సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు ఉన్నాయి. సదరు నాయకుడు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఇక్కడంతా కలెక్షన్లే. అన్నింట్లో వాటాలు తీసుకుంటారనే ప్రచారం ఉంది. తన అక్రమ సంపాదనకు సిమెంట్‌ పరిశ్రమలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ‘గత ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టినా.. మీ వ్యాపారం సజావుగా జరగాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ కొన్ని సిమెంటు ఫ్యాక్టరీల యజమానులను ఎమ్మెల్యే బెదిరించి కోట్లు కొల్లగొట్టారని చెబుతారు. ఇక నియోజకవర్గంలో సోలార్‌ కంపెనీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వారినుంచి కూడా ఆమ్యామ్యాలు వసూలు చేసి బ్యాంక్‌ ఖాతాలోకి పంపించినట్లు ప్రచారం జరిగింది. సోలార్‌ కంపెనీ ప్రతినిధులు ఇతర వైసీపీ నేతల వద్ద ఈవ్యవహారాన్ని ప్రస్తావించినట్లు చెబుతారు. ఓ మైనింగ్‌ నిర్వాహకుడి నుంచి సదరు నేత రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారనే ప్రచారం ఉంది. నియోజకవర్గంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో లైన్‌ ఆపరేటర్ల పోస్టులు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు ప్రచారం ఉంది. ఇక సోలార్‌ కంపెనీలో పనిచేసే కూలీలకు రూ.400 ఇస్తారు. అయితే అక్కడ కూడా ఒక్కొక్కరి నుంచి రూ.వంద కమిషన్‌ కాజేసినట్లు చెబుతారు. టీడీపీ హయాంలో కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు మంజూరు చేయిస్తామంటూ డబ్బు వసూలు చేశారనే ప్రచారం ఉంది. అన్నింటిలో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది.

చికెన్‌లోనూ చేతివాటం

ఎమ్మెల్యే చివరకు చికెన్‌ కొట్టు నిర్వాహకులను కూడా వదలకుండా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిఫలంగా చికెన్‌ కొట్టు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. నియోజకవర్గం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కేజీ చికెన్‌ రూ.120, 110 మధ్య ఉంటే.. అక్కడ మాత్రం రూ.40, 50 అధికంగా ఉండేది. యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. లోకేశ్‌ మాటలు ఆ నియోజకవర్గంలోని జనానికి బాగా కనెక్ట్‌ అయ్యాయి. దీంతో జనాల్లో మరింత పలుచనవుతానని భావించి అప్పటి నుంచి చికెన్‌ కొట్టు నిర్వాహకుల నుంచి సదరు నాయకుడు ముడుపులు తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో చికెన్‌ రేట్లు బయటి ప్రాంతాల్లో ఉన్నట్టు ఇక్కడా అందుబాటులో ఉన్నాయి.

ఎమ్మెల్యే స్వగృహం ఉన్న మండలంలో నాపరాయి పరిశ్రమలు భారీగా ఉన్నాయి. 30 గనులు, 200 పరిశ్రమలు ఉన్నాయి. ఏటా ఇక్కడ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య వ్యాపారం జరుగుతుందని అంచనా. ఎమ్మెల్యే అక్కడి గనుల యజమానులను పూర్తిగా తన కంట్రోల్‌లో పెట్టుకున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలతో సంబంధాలు పెట్టుకున్న, వారిని ఆహ్వానించిన వ్యాపారులపై ఉక్కుపాదం మోపారని చెబుతారు. ఎమ్మెల్యే దెబ్బకు భయపడి వ్యాపారులంతా టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారని...

ఎమ్మెల్యే అనుచరుడు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేసి బాగా సంపాదిస్తున్నారు. ఇసుక అమ్మకాల్లో ఎమ్మెల్యేకు వాటాలు వెళుతున్నట్టు సమాచారం. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు టీడీపీ నేతలపై ఎదురు కేసులు పెట్టించారు. ఇసుక తవ్వకాలపై స్థానిక టీడీపీ ఇన్‌చార్జి పెన్నానదిలో నిరసన తెలుపుతూ అక్కడ ఉన్న టిప్పర్‌ను నిలిపివేశారు. వాహనం తాళాలు తీసుకుని పోలీసులకు అప్పజెప్పారు. నిరసన అనంతరం వెనక్కి వస్తున్న టీడీపీ నాయకుడి అనుచరులపై ఎమ్మెల్యే బామ్మర్ది తన అనుచరులతో వెళ్లి గొడవకు ప్రయత్నించారు. ‘ఈ టిప్పరు నాది, ఏం చేస్తావు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెబుతారు. ఈ వ్యవహారంలో టిప్పర్‌ డ్రైవర్‌పై టీడీపీ నేతలు దాడి చేయకున్నా దాడి చేసినట్లు కేసు పెట్టడం గమనార్హం.

ఫిర్యాదు చేశారని హత్య

గండికోట ముంపు పరిహారం విషయంలో ఫిర్యాదు చేశారని సొంత పార్టీకే చెందిన మరో కీలక నాయకుడి వర్గీయుడిని ఎమ్మెల్యే అనుచరులు హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో గండికోట ముంపు బాధితులు ఉన్నారు. ఓ గ్రామంలో లేనివారి పేర్లను కూడా నిర్వాసితుల జాబితాలో చేర్చి పరిహారం బొక్కేస్తున్నారని వైసీపీకే చెందిన కీలక నాయకుడి వర్గీయుడు, ఆర్మీ మాజీ ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసేందుకు అధికారులు వచ్చారు. అధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే వర్గీయులు ఆయన్ను దారుణంగా హత్య చేసినట్లు చెబుతారు.

Updated Date - Mar 04 , 2024 | 03:44 AM