Share News

ఉచితం పేరుతో దోపిడీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:33 AM

‘‘పేదలందరికీ ఉచితంగా నీరందిస్తాం.. వారి దాహార్తి తీర్చడమే మా ధ్యేయం’’ అంటూ పంచాయతీ పాలకవర్గం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఇంటింటికీ నీరందిస్తున్నారు.

ఉచితం పేరుతో దోపిడీ

లక్షల్లో వసూళ్లు

అందరూ వాటాదారులే..

మద్దికెర, మార్చి 28: ‘‘పేదలందరికీ ఉచితంగా నీరందిస్తాం.. వారి దాహార్తి తీర్చడమే మా ధ్యేయం’’ అంటూ పంచాయతీ పాలకవర్గం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఇంటింటికీ నీరందిస్తున్నారు. అయితే.. ఉచితం పేరుతో ప్రజల వద్ద నుంచి లక్షల్లో దోచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్దికెర మేజర్‌ గ్రామ పంచాయతీలో మొత్తం 4,950పైగా గృహాలున్నాయి. గతంలో 1,595 మంది రూ.6వేల ప్రకారం పంచాయతీలకు డిపాజిట్‌ చెల్లించి కొళాయిలు వేసుకున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌ పథకం కింద జగనన్న కాలనీలో, సాయినగర్‌ కాలనీలో ఉచిత కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. పంచాయతీ పాలకవర్గం అధికారులు ఏకమై జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ సొంత కొళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి అధికారికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇలా మద్దికెరలో ఇప్పటి వరకు దాదాపు 2,500 వరకు ఉచిత కనెక్షన్లు ఇచ్చారు. ఈ లెక్కన రూ.800 నుంచి రూ.1000 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తున్న లక్షలాది రూపాయలు అధికారులకు, నాయకులకు వాటాలుగా ముడుతున్నందువల్లనే ఎవరూ ఏమీ అనడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ఆదాయమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఉచిత కొళాయి కనెక్షన్లపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి స్వర్ణలత మాట్లాడుతూ తమ దృష్టికి రాలేదని, ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.

రూ.800 ఇచ్చా

మద్దికెర పంచాయతీ వారు ఉచిత కొళాయి కనెక్షన్లు ఇస్తున్నారని నేను కొళాయి వేయించుకున్నా. రూ.800 ఇప్పించుకున్నారు. మెటిరీయల్‌కు రూ.2వేలు ఖర్చు అయింది. మొత్తం రూ.2,800 చెల్లించా. ఉచితం అంటూ డబ్బులెందుకు తీసుకుంటున్నారో?

- పులికొండ, గ్రామస్థుడు

ఉచితం అన్నారు.. డబ్బులు వసూలు చేస్తున్నారు

పంచాయతీవారు ఉచితంగా కొళాయి కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. కనెక్షన్‌ ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉచితం అంటూనే ఇలా మోసగిస్తున్నారు. డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి.

- రామేశ్వరమ్మ, గ్రామస్థురాలు

Updated Date - Mar 29 , 2024 | 12:33 AM