Share News

సంక్షేమం ముసుగులో వైసీపీ దోపిడీ

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:21 AM

: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే పేదల సొమ్మును దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికార

సంక్షేమం ముసుగులో వైసీపీ దోపిడీ

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది: పురందేశ్వరి

అమరావతి, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే పేదల సొమ్మును దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులకు రాష్ట్రస్థాయి వర్క్‌షాపు, మైనార్టీ మోర్చా రాష్ట్రస్థాయి సమావేశాల్లో ఆమె ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని ఆమె చెప్పారు. కేంద్రం ఏం చేస్తుందో.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవని, 50 రోజుల్లోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదనే అపోహను తొలగించాల్సిన బాధ్యత మీడియా ప్యానలిస్టులపై ఉందన్నారు. మతం పేరుతో ఓట్లు దండుకునే సిద్ధాంతం కాంగ్రెస్‌ పార్టీదేనని విమర్శించారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతోపాటు మైనారిటీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.

Updated Date - Mar 01 , 2024 | 08:26 AM