Share News

ఖరీదైన యంత్రాలున్నా.. క్యాన్సర్‌కు అందని వైద్యం!

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:05 AM

దేశంలో సంభవించే మరణాల్లో హృదయ సంబంధ వ్యాధులు (సీవీడీ), గుండెపోటు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌ మరణాలు 60 శాతం వరకు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

ఖరీదైన యంత్రాలున్నా.. క్యాన్సర్‌కు అందని వైద్యం!

విభజనచట్టం కింద కర్నూలులో 120 కోట్లతో క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు

ఖరీదైన యంత్రాలపై 40 కోట్లకు పైగా వ్యయం

కానీ, కూర్చోడానికి కుర్చీలు, రోగులకు మంచాలు కరువు

కనీసం ఫోర్త్‌క్లాస్‌ సిబ్బందినీ నియమించని అధికారులు

ఆక్సిజన్‌ పైప్‌లైన్‌, జనరేటర్‌ లేకుండా తామేం చేయాలంటున్న వైద్యులు

తాత్కాలిక ఓపీతో సరి.. రోగులు ప్రైవేటు బాట..

దేశంలో సంభవించే మరణాల్లో హృదయ సంబంధ వ్యాధులు (సీవీడీ), గుండెపోటు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌ మరణాలు 60 శాతం వరకు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో క్యాన్సర్‌ జబ్బు బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరగడమే కాకుండా మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. క్యాన్సర్‌ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే, మరణాలను తగ్గించే అవకాశం ఎక్కువ. ఇదే లక్ష్యంతో విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కర్నూలుకు క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ను కేటాయించింది. ఇప్పుడు భవనాలు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కనీస వసతులు, సౌకర్యాలు, ఫర్నిచర్‌ను కల్పిస్తే క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ను పూర్థిస్థాయిలో బాగా నడిపించవచ్చు. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడీ ఇనిస్టిట్యూట్‌ తాత్కాలిక ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. ఆస్పత్రి పరిశుభ్రత కోసం ఫోర్త్‌క్లాస్‌ ఎంప్లాయీ్‌సను నియమించకపోవడం వైద్య అధికారుల అలక్ష్యానికి పరాకాష్ఠ!

విభజన చట్టంలో భాగంగా...

దేశంలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2010లో నేషనల్‌ ప్రోగ్రాం ఫర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌, డయాబెటిక్‌, కార్డియోవాస్కులర్‌ డిసీజెస్‌ అండ్‌ స్ట్రోక్‌ (ఎన్‌పీసీడీసీఎ్‌స)ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలో రూ.కోట్లు ప్రజాధనం వెచ్చించి స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణం చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2014లో రూ.120 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రాష్ట్రం వాటా రూ.48 కోట్లు (40శాతం). అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణం కోసం కేఎంసీ ఆవరణలో తొమ్మిది ఎకరాలు కేటాయించింది. భవనాల డిజైన్‌, సాంకేతిక పరిజ్ఞానం కోసం టాటా కన్సల్టెన్సీ సేవలు తీసుకున్నారు. ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్ల పర్యవేక్షణలో..1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ (జీ+1) 9 బ్లాకుల్లో లీనియర్‌ యాక్సిలరేటర్‌ (రోగి క్యాన్సర్‌ గుర్తించి రేడియేషన్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చే కేంద్రం) సెంటర్‌ ఎల్‌ఏ-1, ఎల్‌ఏ-2 చాంబర్స్‌, 3 ఆపరేషన్‌ థియేటర్లు (ఓటీ), ఎమర్జెన్సీ వార్డు, జనరల్‌ వార్డులు, ఐసీయూ సహా వివిధ విభాగాల నిర్మాణాలకు 2019 జనవరి 8న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన సాయి పవర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ 15 నెలల్లో పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. 2019 జనవరిలో పనులు మొదలు పెట్టింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రెండేళ్లకు పైగా పురోగతి లేకుండాపోయింది. కరోనా కూడా ఓ కారణమే. తరువాత పనులు మొదలు పెట్టి సివిల్‌ పనులు మాత్రమే పూర్తి చేశారు. కాన్సర్‌ చికిత్సకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు, ఫర్నిచర్‌ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే.. ఎన్నికల కోడ్‌ వస్తుందని హడావుడిగా నాటి ఆర్థిక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ ఏడాది మార్చి 7న ప్రారంభించేశారు.

- కర్నూలు, ఆంధ్రజ్యోతి


రూ.45 కోట్లు ఖర్చు చేసినా..!

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలు స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌పై దృష్టి సారించింది. రూ.30 కోట్లకు పైగా విలువైన లీనియర్‌ యాక్సిలరేటర్‌ ఆధునిక వైద్య యంత్రం, రూ.9.88 కోట్లతో సీసీ సెమిలేటర్‌, రూ.2కోట్లతో అలా్ట్రసౌండ్‌ స్కానర్‌, రూ.3కోట్లతో ఎక్స్‌రే యంత్రాలు, ఐసీయూ బెడ్స్‌.. సమకూర్చారు. ఇప్పటికే రూ.45కోట్లకు పైగా ఖర్చు చేశారు. 60మంది వైద్యులు, 21మంది స్టాఫ్‌ నర్సులను నియమించారు. అయినా ఆక్సిజన్‌, జనరేటర్‌ సౌకర్యం లేకుండా రోగులకు వైద్యం అందించలేమని, ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు అంటున్నారు. క్యాన్సర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే కావాల్సిన పరికరాలు, యంత్ర సామగ్రి, ఫర్నిచర్‌ కోసం 3నెలల క్రితమే ఏపీఎంఎ్‌సఐడీసీకి ఇండెంట్‌ పెట్టినా.. సంబంధిత సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో అవి చేరుకోలేకపోయాయి. ఇక్కడ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో క్యాన్సర్‌ బాధితులు కర్నూలు సహా హైదరాబాదులో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ స్పందించి... సీఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌తో చర్చించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 04:05 AM