Share News

టీడీపీ అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:39 AM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేసింది.

టీడీపీ అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం!

అవడపోత పనిలో చంద్రబాబు

నెలాఖరుకల్లా 90 మందిపై స్పష్టత!

అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు కొన్ని రోజులుగా ఈ క్రతువులో నిమగ్నమయ్యారు. వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల బలాబలాలకు సంబంధించి తెప్పించుకున్న నాలుగైదు రకాల నివేదికలను ఆయన వడబోస్తున్నారు. ఏదో ఒక నివేదికపై ఆధారపడకుండా రకరకాల మార్గాల ద్వారా సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు. టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్‌ శర్మ బృందం కొన్ని ప్రతిపాదనలు అందజేస్తోంది. నాలుగైదు జిల్లాలకు కలిపి నియమించిన జోనల్‌ సమన్వయకర్తలు కొంత సమాచారం ఇస్తున్నారు. ఇవిగాక పార్టీ సీనియర్ల నుంచి కొన్ని ప్రతిపాదనలు అందుతున్నాయి. వీటితోపాటు రెండు మూడు రకాల ప్రైవేటు సంస్థలను నియమించి వాటి ద్వారా కూడా సమాచార సేకరణ జరుపుతున్నారు. 70-80 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అధినాయకత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలు, ప్రజల్లో వారిపై ఉన్న ఆదరాభిమానాలను మరోసారి బేరీజు వేసుకుని చూసుకుంటోంది. అధికార పార్టీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పుచేర్పులను కూడా గమనిస్తోంది. ఉదాహరణకు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, వేమూరు నియోజకవర్గాల్లో మంత్రులు విడదల రజని, మేరుగ నాగార్జునలను గుంటూరు పశ్చిమ, సంతనూతలపాడుకు మార్చి.. ఇక్కడ కొత్త అభ్యర్థులను వైసీపీ నిలుపుతోంది. టీడీపీకి ఈ రెండు నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు ఇన్‌చార్జులుగా ఉన్నారు. వైసీపీ కొత్త అభ్యర్థులతో పోలిస్తే వీరిద్దరూ బలంగా ఉన్నారని టీడీపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఇదే మాదిరిగా అన్ని నియోజకవర్గాలపై పరిశీలన జరుపుతోంది. అయితే అభ్యర్థులను వెంటనే ఖరారు చేయకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఐవీఆర్‌ఎస్‌ విధానం పేరిట ఫోన్‌ సర్వేలు చేసే పద్ధతి టీడీపీలో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఈసారి కూడా ఇదే అమలు చేస్తోంది. ఫోన్‌ సర్వేలు రెండు రకాలుగా చేస్తున్నారు. పార్టీ సభ్యులు, నాయకుల నుంచి విడిగా.. సాధారణ ప్రజల నుంచి వేరుగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల్లో 20-25 నియోజకవర్గాల్లో సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. మదనపల్లె వంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే సర్వే చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు మూడు పేర్లు పెట్టి వీరిలో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో చూస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు నేరుగా చంద్రబాబుకు మాత్రమే అందుతున్నాయి. దీంతో వీటిపై టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ వ్యక్తమవుతోంది.

అభ్యర్థులకు స్పష్టత!

80-90 నియోజకవర్గాల్లో తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు ఈ నెలాఖరు నాటికి అంతర్గతంగానైనా స్పష్టత ఇవ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాతే పేర్లు అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. పొత్తు ప్రతిపాదనలో ఉన్న నియోజకవర్గాలను అధికారిక ప్రకటనలో ఆపి కొంత ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి మధ్యలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఆశావహుల సందడి

అభ్యర్థుల ఎంపికకు కసరత్తు జరుగుతుండడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతల సందడి పెరిగింది. ఆశావహులు, వారి అనుచరులు పెద్దసంఖ్యలో తరలివచ్చి చంద్రబాబు దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డితోపాటు టికెట్‌ ఆశిస్తున్న రాంప్రసాద్‌ రెడ్డి అనే నేత తన సహచరులతో చంద్రబాబును కలిశారు. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి తన సహచరులతో తరలివచ్చారు. నరసరావుపేట నుంచి నల్లపాటి రాము అనుచరవర్గం వచ్చింది. జయహో బీసీ సదస్సుకు హాజరైన ఇంకొందరు నేతలు చంద్రబాబుకు తమ వినతులు విన్నవించారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సదస్సు వేదికపైనే అభ్యర్థించారు. పెనుకొండ టికెట్‌ ఆశిస్తున్న సబిత, చిత్తూరు ఆశిస్తున్న నాజర్‌, గుంతకల్‌ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే జితేందర్‌ గౌడ్‌తో పాటు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి,. ప్రొద్దుటూరు టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా ఉన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 04:39 AM