Share News

పరువునష్టం కేసులో జగన్‌కు ఊరట

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:10 AM

మంత్రి నారాయణ వేసిన పరువునష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.

పరువునష్టం కేసులో జగన్‌కు ఊరట

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మంత్రి నారాయణ వేసిన పరువునష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. విజయవాడ ఎంపీ,ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు ఆయన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత పిటిషన్‌ పై నిర్ణయం వెల్లడించేవరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబరు 20కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. రాజధాని భూముల వ్యవహారంలో తన పరువుకు భంగం కలిగించేలా జగన్‌ తన పత్రికలో వార్త ప్రచురించారని పేర్కొంటూ 2018లో నారాయణ ప్రత్యేక కోర్టులో పరువునష్టం కేసువేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో తదుపరి చర్యలు అన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్‌కు సాక్షి పత్రికతో సంబంధం లేదు. ఆ పత్రికలో వచ్చిన కథనానికి బాధ్యుడిని చేస్తూ జగన్‌ పై పరువు నష్టం కేసు వేశారు. పత్రికలో ప్రచురించే కథనాలను జగన్‌ ఎంపిక చేస్తారని ఆరోపించారు. పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ పత్రిక ఎడిటర్‌ ఇప్పటికే కోర్టులో పిటిషన్‌ వేశారు. గత ఆరేళ్లుగా పిటిషన్‌ విచారణలో ఎలాంటి పురోగతి లేదు. ిఈ నెల 15న పిటిషనర్‌ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. పిటిషనర్‌ తరఫున ఆయన న్యాయవాది హాజరయ్యేందుకు వెసులుబాటు ఇవ్వండి. ’’ అని వాదించారు. న్యాయవాది రాహుల్‌ చౌదరి స్పందిస్తూ....మంత్రి నారాయణ తరఫున న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వకాల్తా వేశారన్నారు. కేసులో కౌంటర్‌ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.’

Updated Date - Nov 13 , 2024 | 03:10 AM