Share News

వేలాల్లో మితిమీరిన జోక్యం

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:55 PM

ఎమ్మిగనూరు పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వన రులైన మున్సిపల్‌ మార్కెట్ల వేలాల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం మితిమీరిపోతోంది.

 వేలాల్లో మితిమీరిన జోక్యం
పాటాదారులకు సూచనలు చేస్తున్న మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నజీర్‌

అధికార పార్టీ నేత హల్‌చల్‌

అయినవారికే దక్కిన మార్కెట్‌ యార్డులు

ఆశించిన స్థాయిలో పెరగని ఆదాయం

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 13: ఎమ్మిగనూరు పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వన రులైన మున్సిపల్‌ మార్కెట్ల వేలాల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం మితిమీరిపోతోంది. దీంతో పురపాలక సంఘానికి రూ.లక్షల్లో రావాల్సిన ఆదాయం కాస్తా వేలకు పడిపోయింది. ఈ ప్రభావం పట్టణాభివృద్ధిపై పడుతోందని పట్టణ వాసులు బహిరంగంగానే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ గంగిరెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ల వేలాలను నిర్వహించారు. వారపు సంత మార్కెట్‌ వేలం పాడేందుకు పాటా దారులు రాక వేలం పాట వాయిదా పడింది. డైలీ మార్కెట్‌ వేలం పాటను రూ.27.54 లక్షలుగా అధికారులు నిర్ణయించగా దస్తగిరి, మునీర్‌ వేలం పాటలో పాల్గొన్నారు. వీరిలో మునీర్‌ రూ.27.57లక్షలకు దక్కించుకున్నారు. అలాగే వారపు పశువుల మార్కెట్‌ను రూ.15.59 లక్షలకు నిర్ణయించగా దస్తగిరి, రాము, రామకృష్ణ పాటలో పాల్గొనగా రామకృష్ణ రూ.15.62 లక్షలకు దక్కించుకున్నారు. గొర్రెల మార్కెట్‌ను రూ.15.52లక్షలుగా నిర్ణయించగా రామకృష్ణ, రాము పోటీ పడ్డారు. రాము రూ.15.66 లక్షలకు దక్కించుకున్నారు. ఇక గొర్రెల కమేళాను రూ.లక్షా 27వేలకు నిర్ణయించగా హనీఫ్‌ అనే పాటా దారుడు రూ.లక్షా 29వేలకు దక్కించుకోగా, మాంసపు మార్కెట్‌ను రూ.లక్షా 30వేలకు నిర్ణయించగా రహిమాన్‌ అనే పాటాదారుడు రూ.లక్షా 35వేలకు దక్కించుకున్నారు. వేలం పాటల్లో అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నజీర్‌ పాల్గొని పాటా దారులకు సూచనలు చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే పాటాదారులు కుమ్మక్కై అధికారులు నిర్ణయించిన పాటా ధరకన్నా కేవలం నాలుగైదువేలు మాత్రమే పెంచి మార్కెట్‌ వేలాలను దక్కించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది పురపాలక సంఘానికి కేవలం రూ.18వేల ఆదాయం మాత్రమే పెరిగింది. ఏదో పోటీ ఉంది.. అంటే ఉంది.. అన్నట్లుగా వేలం పాటలు సాగడంతో మున్సిపల్‌ ఆదాయానికి భారీగానే గండి పడిందని స్థానికులు అధికార నేత జోక్యంపై మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నజీర్‌ అహ్మద్‌, మేనేజర్‌ వరప్రసాద్‌, ఆర్వో బేబి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 11:56 PM