Share News

ఆ ఒక్కటీ తప్ప..

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:54 AM

ఎన్నికల బాండ్లకు సంబంధించి రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుకు గతంలో సీల్డ్‌ కవర్లలో సమర్పించిన వివరాలను..

ఆ ఒక్కటీ తప్ప..

యునిక్‌ నంబర్‌ లేకుండా మరోసారి ఎన్నికల బాండ్ల సమాచారం

ఈసారి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలు వెల్లడించిన ఈసీ

బీజేపీకి రూ.6,986.5 కోట్లు.. టీఎంసీకి రూ.1,397 కోట్లు

కాంగ్రెస్‌కు రూ.1,334 కోట్లు.. బీఆర్‌ఎస్‌కు రూ.1,322 కోట్లు

ఏపీలో వైసీపీకి రూ.442.8 కోట్లు.. టీడీపీకి రూ.181.3 కోట్లు

దాతల వివరాలనూ వెల్లడించిన డీఎంకే, అన్నాడీఎంకే, జేడీఎస్‌

మేఘా బాండ్లు డీఎంకేకు రూ.105 కోట్లు, జేడీఎస్‌కు 50 కోట్లు

న్యూఢిల్లీ, మార్చి 17: ఎన్నికల బాండ్లకు సంబంధించి రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుకు గతంలో సీల్డ్‌ కవర్లలో సమర్పించిన వివరాలను.. ఎన్నికల కమిషన్‌ ఆదివారం తన వెబ్‌సైట్‌లో పెట్టింది. అయితే, ఈసారి కూడా ఇంతకుముందులాగానే యునిక్‌ నంబర్‌ లేకుండా వాటిని వెల్లడించడం గమనార్హం. ఈ వివరాలతో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయో తెలుస్తుందిగానీ.. ఆ విరాళాలు ఎవరిచ్చిందీ తెలిసే అవకాశం లేదు. ఆయా పార్టీలు సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరాల ప్రకారం.. బీజేపీ అందుకున్న మొత్తం ఎలక్టోరల్‌ బాండ్ల విలువ రూ.6,986.5 కోట్లు. అందులో దాదాపు రూ.2,555 కోట్లు 2019-20లో అందుకున్నవే. టీఎంసీ పార్టీ అందుకున్న బాండ్ల విలువ రూ.1,397 కోట్లు. బీజేపీ తర్వాత అత్యధికంగా ఎన్నికలబాండ్లు అందుకున్న పార్టీ అదే. కాంగ్రెస్‌ పార్టీ అందుకున్న బాండ్ల విలువ రూ.1,334.35 కోట్లు కాగా రూ.1,322 కోట్లతో బీఆర్‌ఎస్‌ 4వస్థానంలో ఉంది.

బిజూ జనతాదళ్‌ పార్టీకి రూ.944.5 కోట్ల విలువైన విరాళాలు బాండ్ల రూపంలో వచ్చాయి.

వైసీపీకి వచ్చిన బాండ్ల విలువ రూ.442.8 కోట్లు కాగా.. టీడీపీ రూ.181.35 కోట్ల విలువైన బాండ్లను నగదుగా మార్చుకుంది.

కర్ణాటకలో జేడీఎస్‌ పార్టీకి రూ.89.75 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. అందులో రూ. 50 కోట్ల విలువ చేసే బాండ్లు ఒక్క మేఘా ఇంజనీరింగ్‌ సమర్పించుకున్నవే.

రూ.1,368 కోట్ల విలువైన బాండ్లతో.. శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ దేశంలో అతిపెద్ద ఎలక్టోరల్‌ బాండ్ల కొనుగోలుదారుగా నిలిచింది. ఆ కంపెనీ కొన్న బాండ్లలో 37ు డీఎంకే పార్టీకే సమర్పించింది.

తాము ఎన్నికల బాండ్ల విధానానికి వ్యతిరేకమైనందున ఎలాంటి బాండ్లూ స్వీకరించలేదని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), ఏఐఎఫ్‌బీ సుప్రీంకోర్టుకు తెలపగా.. తమకు బాండ్ల రూపంలో విరాళాలూ రాలేదని మజ్లిస్‌, బీఎస్పీ తదితర పార్టీలు తెలిపాయి.

ఆ వివరాలూ చెప్పించండి..

ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించి ఇప్పటిదాకా వెల్లడైంది 76ు వివరాలేనని.. మిగతా 24ు వివరాలు కూడా వెల్లడించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్‌ 11 నడుమ రూ.4,002 కోట్ల విలువైన బాండ్లు జారీ అయ్యాయని.. వాటిని కొన్నవారెవరు? ఎవరికి ఇచ్చారో కూడా బయటపెట్టించాలని కోరుతూ సిటిజన్‌ రైట్స్‌ ట్రస్ట్‌ అనే సంస్థ ఈ పిల్‌ వేసింది. మరోవైపు.. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ ‘క్విడ్‌ ప్రో కో’కు పాల్పడిందని.. నల్లధనాన్ని బాండ్ల రూపంలో పార్టీ ఖాతాలకు మళ్లించడానికి కుట్రపన్నుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని ప లు నిబంధనలను ఉల్లంఘించిన 19 కంపెనీలను కేం ద్ర ఆర్థిక శాఖ 2018లో ‘హై రిస్క్‌’ కంపెనీలుగా ప్రకటించిందని.. దరిమిలా అవే కంపెనీలు రూ.2,717 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొన్నాయని, ఆ తర్వాత ఆర్థి క సంవత్సరంలో ప్రకటించిన హైరిస్క్‌ కంపెనీల్లో వా టిలో 18 కంపెనీల పేర్లు లేవని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ మండిపడ్డారు. కాగా, తమిళపార్టీలు ఎన్నికల బాండ్లు సమర్పించిన దాతల వివరాలను బయటపెట్టాయి. వాటి ప్రకారం.. అన్నాడీఎంకేకు బాండ్లు ఇచ్చిన దాతల్లో ఒకరు చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం కాగా.. మరొకరు అడయార్‌కు చెందిన గోపాల్‌ శ్రీనివాసన్‌ అనే వ్యక్తి! ఆ పార్టీకి వచ్చిన రూ.6.05 కోట్లలో గోపాల్‌ ఇచ్చింది రూ.5 లక్షలే. మిగతా రూ.6 కోట్లూ చెన్నై సూపర్‌కింగ్స్‌ దాతృత్వమే!! ఇక డీఎంకేకి వచ్చిన రూ.656.5 కోట్లలో రూ.509 కోట్ల విలువ చేసే బాండ్లను ఆ పార్టీకి ఇచ్చింది లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌కు చెందిన ‘ఫ్యూచర్‌ గేమింగ్‌’ కావడం గమనార్హం. మేఘా ఇంజనీరింగ్‌ నుంచి డీఎంకే రూ.105 కోట్లు అందుకుంది.

Updated Date - Mar 18 , 2024 | 03:54 AM